గడియారంలో ముళ్లు సెకన్లు, నిమిషాలు, గంటలు దాటిపోతున్నా వారి చర్చలకు తెరపడదు. జనసేనాని, త్రివిక్రమ్ ల మధ్య సంభాషణా స్రవంతి గోదారి ప్రవాహంలా సాగుతుంది. వారిద్దరూ లోతుగా చర్చించేది సినిమాల గురించా! రాజకీయాల గురించా?
శ్రీశ్రీ సాహిత్యం నుంచి శేషేంద్ర ఆధునిక మహాభారతం వరకూ చిన్నయసూరి వ్యాకరణం నుంచి తెలుగు శతకాల వరకూ, జాషువా కవిత్వం నుంచి చలం రచనల వరకూ, కొడవటిగంటి కథల నుంచి మధుబాబు డిటెక్టివ్ నవలల వరకూ తెలుగు సాహిత్యం గురించి కబుర్లు సురగంగా ప్రవాహంలా సాగిపోతుంటాయి.
సాహితీ మిత్రులు పవన్ కల్యాణ్, త్రివిక్రం గారు శుక్రవారం సాయంత్రం భీమ్లా నాయక్ సెట్లో మహాకవి శ్రీశ్రీ రచనా వైశిష్ట్యం గురించి, పదాల పరుగులతో పోహళింపుతో చదువరులను చైతన్యపరచడం గురించి, యువతరం రక్తాన్ని వేడెక్కించడం గురించి మాట్లాడుకున్నారు. శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న మహా ప్రస్థానం ప్రత్యేక స్మరణికను త్రివిక్రమ్ కు జ్ఞాపికగా పవన్ అందచేశారు. ఆ పుస్తక ముద్రణ, అందులోని అరుదైన చిత్రాల గురించి వీరు చర్చించుకున్నారు. శ్రీశ్రీ కవిత్వం గురించి రెండు మాటలు చెప్పండి. మీరు చెబితే వచ్చే అందం వేరు అని త్రివిక్రమ్ ని పవన్ కల్యాణ్ కోరారు.