హీరోయిన్ కీర్తి సురేష్‌కు నేడు (అక్టోబర్ 17) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహానటి సినీ యూనిట్ ఆమె కళ్లను మాత్రం చూపిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. కీర్తి సురేష్‌కు సమంత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇప్పటికే అభిమానుల నుంచి శుభాకాంక్షలు, ప్రశంసలు అందుకున్న కీర్తి సురేశ్‌పై సమంత చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ''ఆ కళ్లను ఎవ్వరూ దాచలేరు. ఆ కళ్లే మహానటి జీవిత చరిత్రను చెప్పబోతున్నాయి. కీర్తి సురేశ్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని కామెంట్ చేసింది.
మహానటి ఫస్ట్ లుక్‌లో కీర్తి మహానటి సావిత్రిలానే కనిపించింది. ఆమె కళ్లేనా అవి అన్నట్లు నెటిజన్లు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కేవలం కీర్తి కళ్లు మాత్రమే కనిపిస్తున్న ఈ ఫస్ట్‌లుక్ చూస్తే అది సావిత్రి ఫొటోనా? లేక కీర్తి ఫొటోనా? అని తేల్చుకోలేకపోయారు. మహానటిగా కీర్తిసురేష్ బాగా ఒదిగిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇకపోతే, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, అర్జున్ రెడ్డి జంట విజయ్ దేవరకొండ, షాలిని పాండేలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దుల్కర్ సల్మాన్ పోషిస్తున్న జెమినీ గణేషన్ పాత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.