జీవితంలో అలాంటి అవకాశాలు రావు, ఆశపడకూడదు అని నిర్ణయించుకుని ఆశ చంపుకున్న చోటే వెతుక్కుంటూ అవకాశం ఎదురైతే... ఎవరైనా కాదని ఊరుకోగలరా.. ఇప్పుడు భారతీయ సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ పరిస్థితీ అలాగే ఉంది మరి. శ్రీదేవికి అతిపెద్ద ఫ్యాన్ అయిన రెహమాన్ ఆమె సినిమాకి పాటలు స్వరపరిచే అవకాశం వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. కాని శ్రీదేవి నటించిన తాజా చిత్రం మామ్లో ఆ గోల్డెన్ చాన్స్ రావడంతో ఆనందం పట్టలేక ఉబ్బితబ్బిబ్బయ్యాడు రెహమాన్. శ్రీదేవి తనంతట తాను అడిగితే కాదనగలనా వెంటనే ఒప్పేసుకున్నా అంటూ అభిమానం చాటుకున్నాడు రెహమాన్. అదేదో ఆయన మాటల్లోనే విందాం.
‘‘శ్రీదేవికి నేను పెద్ద ఫ్యాన్. నా చిన్నప్పటి నుంచి ఆమెను అభిమానిస్తున్నా. ఆమె సినిమాకి పాటలు స్వరపరిచే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు’’ అన్నారు సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్. ‘మామ్’ సినిమా రూపంలో ఆయనకు ఆ గోల్డెన్ ఛాన్స్ రానే వచ్చింది. ‘‘శ్రీదేవిగారు ‘నువ్వీ సినిమాకి చేయాలని అడిగితే కాదనగలనా వెంటనే ఒప్పేసుకున్నా. శ్రీదేవిగారు అద్భుతమైన నటి. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని రెహమాన్ అన్నారు.
రవి ఉడయవర్ దర్శకత్వంలో శ్రీదేవి టైటిల్ రోల్లో ఆమె భర్త బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 7న విడుదల కానుంది. ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా ద్వారా అమాయకపు గృహిణి పాత్రలో అదరగొట్టిన శ్రీదేవి మళ్లీ తానే ప్రధాన పాత్రలో మామ్ సినిమాతో మనముందుకు వస్తుండటం మరీ విశేషం. అంటే జూలై 7న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో శ్రీదేవి మన తెలుగులోనే మాట్లాడుతుందన్నమాట.