అల్లరి చిత్రం నుంచి చలపతిరావు కుమారుడు రవి దర్శకుడుగా కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఆమధ్య అనసూయ చేశాడు. తర్వాత నచ్చావులే చేసి లవ్‌స్టోరీ సక్సెస్ చేశాడు. మళ్లీ ఈసారి మర్డర్ మిస్టరీని కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఈ చిత్రంలో గర్భిణీ స్త్రీలను టార్గెట్ చేశాడు. ఈ కథ హాలీవుడ్ చిత్రాలకు సరిపోయేది. మరి మన నేటివిటీకి ఎలాగుంటుందో...
కథలోకి వెళితే... ఆ ఊరిలో గర్భిణీ స్త్రీలపై దాడులు జరుగుతుంటాయి. కరెక్టుగా శిశువు జన్మించే 9 నెలలు క్రమంలో ఇటువంటివి జరుగుతుంటాయి. ఒక్కో సందర్భంలో గర్భిణీలను కూడా కడుపు కోసేసి ఎత్తుకుపోతుంటాడు ఉన్మాది. దీనికి ముందే 108 ఫోన్ చేసి ఫలానా గర్భిణీకి సీరియస్‌గా ఉందని చెపుతాడు. వారు వచ్చేలోగా ఉన్మాది శిశువును తీసుకుని జంప్.
ఈ మిస్టరీని ఛేదించడానికి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ వెంకట్(రవిబాబు) ప్రవేశిస్తాడు. ఓ సంఘటనలో ఉన్మాది (తారకరత్న) పట్టుబడతాడు. కానీ అతడిని పట్టుకున్నా శిశుమరణాలు జరిగిపోతుంటాయి. కానీ వెంకట్‌కు ఎక్కడో ఏదో జరుగుతుందనే అనుమానం వస్తుంది. ఆ అనుమానాన్ని ఎలా ఛేదించాడు? ఈ ఉన్మాది ఎందుకలా చేశాడు ? అన్నది మిగిలిన సినిమా.
ముఖ్యంగా రవిబాబు పాత్ర కామెడీగా ఉంటుంది. పోలీసు ఆఫీసర్ పాత్రలో రొమాంటిక్ టచ్ కూడా ఉంది. స్నేహ అతని భార్యగా నటించింది. పేరుకు అమరావతి అని టైటిల్ రోల్ ప్లే చేసినా, భూమికకు న్యాయం జరగలేదనే చెప్పాలి. పాత్ర రన్‌లో ఆమె ప్రాధాన్యత తగ్గింది. రవి పాత్రకు చేదోడుగా ఉండే పాత్ర గద్దె సింధూర. ఎప్పుడూ గన్ పట్టుకుని అదే మూడ్‌లో ఉంటుంది.
ఇక నెగెటివ్ పాత్రలో తారకరత్న ఉత్సుకత చూపించాడు. విలన్ అంటే ఇష్టమొచ్చినట్లు రఫ్‌గా చేస్తే పండుతుంది. దాన్ని పండించలేకపోయాడు. అందుకే ఎక్కువభాగం దర్శకుడు అతనికి మాస్క్ తగిలించాడు. కోట, పరుచూరి గోపాలకృష్ణ పాత్రలు బాగానే ఉన్నాయి.
టెక్నికల్‌గా కెమేరా, బ్యాక్‌గ్రౌండ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అన్ని సినిమాలలాగానే మొదటిభాగం ఇంట్రెస్ట్‌గా సాగింది. సెకండాఫ్‌లో కాస్త కన్ఫ్యూజ్ ఉంటుంది. క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారికి ఇది ఒకే సినిమా.