పాయింట్: ఎప్పుడూ కలిగేది ఆకర్షణ.. ఒక్కసారి కలిగేది ప్రేమ... అందుకే "ప్రేమను ప్రేమించు".. అనే పాయింట్‌కు కథగా మలిచిన సినిమా ఇది.
ఇండస్ట్రీలో కథల కొరత ఉంది అనేది కొన్ని సినిమాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. మరికొన్నింటిని చూస్తే మన చుట్టూనే చాలా కథలే ఉన్నాయి. వాటిని తీసేందుకు సరైన దర్శకుడు లేడనిపిస్తుంది. "నిన్ను కలిశాక" చూశాక దర్శకుడిలోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఈనాటి యువత అంటేనే పెద్దలక ఒక దురభిప్రాయం ఉంటుంది.
ఒక ఆడ, మగ కలిసి మాట్లాడుకున్నా, తిరిగినా ఇద్దరి మధ్య ఉండేది "అదే"నని అనుకుంటారు. మరోరోజు వారే వేరేవారితో ఉంటే బరితెగించారని, ప్రేమ అనేపదాన్ని దుర్వినియోగం చేస్తూ పాశ్చాత్యపోకడలతో మన కట్టుబాట్లను కలుషితం చేస్తున్నారని విమర్శిస్తుంటారు. కానీ నేటి యువతకు జీవితంపైనా, ప్రేమపైనా సరైన స్పష్టత ఉంది. స్నేహం అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి? అనే విషయాల్లో క్లారిటీ ఉంది.. అని చెప్పే ప్రయత్నమే 'నిన్ను కలిశాక'.
చైతన్య (చందు), ప్రియ (బిందు) ఓ జంట. సంతోష్ (అభిరామ్), దీపా షా (దీప్తి) మరో జంట. సాఫ్ట్‌వేర్‌కు చెందిన ఓ ప్రాజెక్ట్ విషయమై అభిరామ్, బిందు హైదరాబాద్ నుంచి యు.ఎస్. వెళతారు. ఒకరినొకరు అనుకోకుండా యు.ఎస్‌లో కలుసుకుని స్నేహితులుగా మారతారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉండే చందు, దీప్తిలు ఒకరినొకరు ఓ సందర్భంలో కలుసుకుంటారు. వారి మధ్య కూడా స్నేహం కుదురుతుంది.
చందు పెయింటింగ్ చేయడమే గాకుండా.. డాన్స్ పోటీల్లోకూడా పాల్గొంటాడు. అలా ఓ సారి టైటానిక్ డ్యాన్స్‌లో దీప్తితో పాటు పాల్గొంటాడు. మరోసారి మరో డాన్స్‌లో ఇద్దరూ పాల్గొని ఫస్ట్‌ప్రైజ్ గెలుచుకుంటారు. ఆ డాన్స్‌లో.. చందు, దీప్తిలు ప్రేమికులుగా జీవించారని జడ్జిలు కితాబిస్తారు.
ఇక యు.ఎస్‌లో తెలుగువారైన అభిరామ్, బిందులుకూడా ఒకే ఆఫీసులో పనిచేయడం వల్ల వారూ స్నేహితులుగా మరింత దగ్గరవుతారు. ఆ స్నేహం ప్రేమవైపు మొగ్గుచూపుతుందా? అనిపించేంతగా ఉంటుంది. ఎందుకంటే బిందు ప్రేమికుడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినా సరైన రెస్పాన్స్ ఇవ్వదు.
అది రీతిలో అభిరామ్ కూడా ఉంటాడు. ఇక ప్రాజెక్ట్ వర్క్ పూర్తయి ఇండియా వచ్చే సందర్భంలో అభిరామ్ బిందుపై తనకున్నది ప్రేమ, ఆకర్షణ అనే సంఘర్షణలో మదనపడుతుంటాడు. ఆ సమయంలో అదే విమానంలో జగపతి బాబు కన్పిస్తాడు. ఏదో షూటింగ్ ముగించుకుని వస్తున్న అతని వద్ద అభిరామ్ తన సంఘర్షణ గురించి చెబుతాడు.
దాంతో జగపతిబాబు ఆశ్చర్యపోయి నిజమైన ప్రేమైతే హృదయంతో ఆలోచించని ఓ చీటీరాసి ఇస్తాడు. అది ఇండియా వెళ్ళాక చదవమని చెబుతాడు. అది ఏమిటి? ఆ తర్వాత నలుగురు ప్రేమ ఎంతవరకు వచ్చింది.? ఎవరు ఎవర్ని ప్రేమించారు..? అసలు దర్శకుడు చెప్పదలుచుకున్నది ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ: ఈ చిత్రంలో అంతా కొత్తవారే నటించారు. "వినాయకుడు ఫేమ్" కృష్ణుడు ఒక్కడే అందరికీ తెలిసిన వ్యక్తి. యు.ఎస్.లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్. కృష్ణుడి పాత్ర పేలవంగా ఉంది. ఒక తరహా హీరోగా నటించిన అతన్ని కామెడీగా ఉపయోగించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. కృష్ణుడుతో ఉన్న ఓ సన్నివేశం అతకలేదు.
రెండు జంటలు కొత్తవారు గనుక వారు నటించింది తక్కువనే చెప్పాలి. ప్రేమికులుగా, స్నేహితులుగా వారు చేసిన నటన అంతా కృతంగా ఉంది. సంజయ్ సంభాషణలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇక లవ్/2 అనే కాఫీబార్ యజమాని బాబాగా దర్శకుడే నటించాడు. అక్కడికి వచ్చే జంటలన్నీ ప్రేమికులు, స్నేహితులు. వారి ప్రేమలో, స్నేహంలో ఎంత స్వచ్ఛత ఉందో? ముందుగానే వెయిటర్లకు చెప్పేస్తుంటాడు. వారంతా నోరు వెళ్ళబెట్టి చూస్తుంటారు.
ఎందుకంటే..? బాబా చెప్పినట్లు అక్కడున్న జంటలు అమలు చేస్తుంటారు. బాబా గెటప్ అచ్చు అమితాబ్‌ను పోలి ఉంటుంది. ఇటువంటి పాత్రను అమితాబ్ లాంటి స్థాయి ఉన్న నటుడే చేయాలి లేదా కొత్తవారు చేయాలని శివనాగేశ్వరరావు భావించారు. అసలు ఈ పాత్రకూడా వేస్టు అని సినిమా చూసినవారికి అనిపిస్తంది.
ఇక సంగీతపరంగా పర్వాలేదు. "నిన్నటి వరకు నిదురపోయా నేడు మనదే రామా రామా.." ఇది తొలి పాట. ఎందుకు ఈ పాట వస్తుందో అర్థంకాదు. ఈ పాట బ్యాక్‌డ్రాప్‌లో మైఖేల్‌జాక్సన్‌పై ప్రేమతో ఆయన బొమ్మను నృత్యదర్శకుడు తరుణ్ పెట్టించాడు. "అందమైన అందరమా చంద్రమా.." పాట చక్కని మెలోడి బాగుంది. ఇక డ్రీమ్ సాంగ్.. మరో పేతాస్ పాటలా ఉంది. కథలో బలం లేకపోవడంతో పాటల్లో సాహిత్యమున్నా సంగీతమన్నా అది వృధాప్రయాసే.
ఇక హాస్యం పేరుతో ఎం.ఎస్. నారాయణ, మాస్టర్ భరత్ సన్నివేశాలు అపహాస్యంలా తయారయ్యాయి. బలవంతంగా గిలిగింతలు పెడితేగాని ప్రేక్షకుడు నవ్వేట్లులేవు. ఇక తండ్రీ కొడుకులుగా ఎం.ఎస్. భరత్ నటించారు. కొడుకు అమ్మాయిల్ని ఏడిపిస్తుంటే.. తండ్రి పాత్రలో ఎం.ఎస్ ప్రోత్సహించి పిల్లవాడిని సపోర్ట్ చేస్తాడు. ఇది ఎలా నవ్వు తెప్పిస్తుందో దర్శకుడికే తెలియాలు.
ఫైనల్లో తరుణ్‌మాస్టర్ ప్రేమ గురించి వివరణ ఇస్తాడు. ఈనాటి యూత్ చెడిపోయిందని అనుకుంటే పొరపాటు. వారి మనస్సు చాలా పెద్దది. ఆడ, మగ కలిస్తే ఏదేదో ఊహించుకోవడం కరెక్ట్ కాదు. డాన్స్‌పోటీలో జడ్జిగా హాజరైన తరుణ్ మాస్టర్.. చందు, దీప్తి నటనచూసి నిజమైన ప్రేమికులనుకున్నాను. అది తన తప్పు. వారు నిజమైన స్నేహితులు అంటూ.. దర్శకుడు పెద్ద నిజాన్ని ప్రజలకు చెబుతాడు.
ఇదంతా ఒక ఎత్తయితే.. బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో సన్నివేశాలన్నీ డల్‌గా ఉన్నాయి. మరోవైపు డబ్బింగ్ ఏ మాత్రం కుదరలేదు. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి.
"నువ్వుకావాలి" సినిమా తీసిన ఉషాకిరణ్ మూవీస్ కథల ఎంపికలోనూ, "మనీ"వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శివనాగేశ్వర రావు దర్శకత్వంలో పట్టు తగ్గిందనేది స్పష్టమవుతోంది.
చివరిగా.. ఓ మాట.. హోటల్‌బాబా పాత్రలో దర్శకుడు.. తన వెయిటర్లు జోగినాయుడు ప్రేమ, స్నేహం గురించి పెద్ద లెక్చరర్ ఇస్తాడు. వెంటనే జోగినాయుడు.. బాబా.. గంటసేపు నుంచి ఇదే చెబుతున్నారు. ఓ ఒక్క ముక్కా నాకు అర్థం కాలేదు బాబా.. అంటాడుయ ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు కూడా అలాగే అనిపిస్తుంది.