ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ... మందుబాబులకు మింగుడుపడటం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం జగన్ నిర్దేశించిన మద్యం పాలసీపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. తమకు నచ్చిన మద్యం ఫ్యామస్ బ్రాండ్‌లు దొరక్క... నిషా కోసం పక్కదారులు పడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె నారాయణ్ నాయక్ ఆదేశాలతో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి జయ రామరాజు, అదనపు ఎస్పీ అరుణ కుమారి, కొవ్వూరు డిఎస్పీ బి శ్రీనాథ్ అధ్వర్యంలో దాడులు ముమ్మరం చేశారు. కొవ్వూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో పోలీసు, ఎస్.ఈ.బి సమన్వయంతో నిత్యం దాడులు జరుగుతున్నాయి.
గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన గోంగూర లంక, ముద్దురులంక గ్రామాలలో అధికారులు నాటు పడవలో ప్రయాణం చేసి దాడులు నిర్వహించారు. అక్కడ నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న బట్టీలను, 11,200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ఎవరైనా ప్రజలు మద్యం నాటుసారా సమాచారాన్ని కంట్రోల్ రూమ్ తెలియజేస్తే, వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే, తాము నాటుసారా నిల్వలను, తయారీని అదుపు చేయడం కష్టసాధ్యమని చెప్పారు.