ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. 121 చోట్ల వైసీపీ.. నగరిలో రోజా లీడ్

గురువారం, 23 మే 2019 (11:06 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే 145కుపైగా నియోజకవర్గాల్లో సత్తా చాటుతోంది. తాజాగా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా 4,200 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇక విజయనగరంలోని కురుపాంలోని పాముల పుష్పవాణి లీడ్‌లో ఉన్నారు. 
 
అలాగే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాలకు సంబంధించిన ఫలితాల ట్రెండ్స్ వెలువడగా.. 121 చోట్ల వైసీపీ, 25 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పటివరకూ కౌంట్ చేసిన ఓట్లలో వైసీపీకి 50.9 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 38.2 శాతం ఓట్లు, జనసేనకు 6.8 శాతం ఓట్లు వచ్చాయని ఈసీ అధికారికంగా ప్రకటించింది. 
 
మరోవైపు లోక్ సభ ఎన్నికలను పరిశీలిస్తే, 532 నియోజకవర్గాల ట్రెండ్స్ వెలువడగా, బీజేపీ 285 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 49 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. వైకాపా 24 స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 
 
మిగతా పార్టీల విషయానికి వస్తే, తృణమూల్ కాంగ్రెస్ 24, బీఎస్పీ 12, బిజూ జనతాదళ్ 12, డీఎంకే 22, ఏఐఏడీఎంకే 2, జనతాదళ్ (యు) 16, ఎల్జేపీ 6, ఎన్సీపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ 8 స్థానాల్లో, టీఆర్ఎస్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయని ఈసీ ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు