నేను కనుక అసెంబ్లీలో అడుగు పెట్టానే అనుకోండి... : ప‌వ‌న్ క‌ళ్యాణ్

శుక్రవారం, 30 నవంబరు 2018 (10:10 IST)
భాష‌, యాసలను అవ‌మానప‌రిచార‌ని ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోతే.. ద‌క్షిణాదిని అడ్డ‌గోలుగా దోచుకుని, మా సంప‌ద‌ను ఉత్త‌రాదికి ప‌ట్టుకెళ్తూ, మా ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తుంటే ద‌క్షిణ‌భార‌త ఆత్మ‌గౌర‌వ పోరాటం వ‌స్తుంద‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్  హెచ్చ‌రించారు. పారిశ్రామికవేత్త‌లుగానీ, అడ్డ‌గోలుగా కోట్లు దోచేసే రాజ‌కీయ నాయ‌కులుగానీ క‌ళ్లు తెర‌చి ప్ర‌జ‌ల మౌలిక అవ‌స‌రాలు గుర్తించ‌క‌పోతే వేర్పాటువాద ఉద్య‌మాలు ఊపందుకుంటాయ‌న్నారు. ఇదే విష‌యం మోడీగారు ప్ర‌ధాని కాక‌ముందు చెప్పాన‌ని, అయితే ఆయ‌న ప్ర‌ధాని అయ్యాక ఢిల్లీ నాలుగు గోడ‌ల మ‌ధ్య బందీ అయ్యారని ఎద్దేవా చేశారు.
 
దాని ఫ‌లిత‌మే మాకు ప్ర‌త్యేక జెండా కావాల‌ని క‌న్న‌డ ప్రాంతంలో నాయ‌కులు నినాదం లేవ‌నెత్తార‌ని గుర్తు చేశారు. దేశం కోసం, స‌మాజం కోసం చ‌చ్చిపోయే వ్య‌క్తులు, మ‌హాత్ముల స్ఫూర్తిని గుండెల్లో నింపుకొనే నాయ‌కులు, దేశ స‌మ‌గ్ర‌త‌ను కోరుకునే వేలాది మంది నాయ‌కుల్లో నేను ఒక‌డిని, మాలాంటి వాళ్లు బ‌తికున్నంత‌ వ‌ర‌కు దేశం విచ్ఛిన్నం కానివ్వ‌మ‌న్నారు. జ‌న‌సేన పోరాట‌ యాత్ర‌లో భాగంగా బుధ‌వారం రాత్రి తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌వ‌ర్గంలోని మ‌లికిపురంలో బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో మలికిపురం మహాసంద్రంలా మారింది.
 
ఈ వేదికపై నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగిస్తూ.. 'జాతీయ పార్టీలు భార‌తీయ జ‌నతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ద‌క్షిణాదిపై వివ‌క్ష చూపిస్తున్నాయి. నేను ఉత్త‌రాది వివ‌క్ష అంటే ఉత్త‌రాది నాయ‌కుల‌ను అన్న‌ట్లు త‌ప్ప‌, ప్ర‌జ‌ల‌ను కాదు. మనకు స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వ‌రూ, స‌హ‌జ వ‌న‌రులు దోచుకెళ్తూ ఉపాధి క‌ల్పించ‌రు. దీని ఫ‌లితంగా నిరుద్యోగం పెరిగిపోతుంది. నైపుణ్యం వెలికితీసే శిక్ష‌ణ సంస్థ‌లు, ఉపాధి క‌ల్పించే చ‌దువులు ఇవ్వ‌గ‌లిగితే యువ‌త‌కు బైక్ న‌డిపే టైం ఎక్క‌డుంటుంది. ప్ర‌భుత్వాలను న‌డిపే చ‌చ్చు నాయ‌కులు వారి కుటుంబాల్లో వారికి ఉద్యోగాలు ఇచ్చుకుంటే యువ‌త‌కు ఇచ్చిన‌ట్లు కాదు.
 
ఒక‌ప్పుడు యువ‌త మ‌హాత్మ‌గాంధీ, సుభాష్ చంద్ర‌బోస్, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని స‌న్మార్గంలో న‌డిచేవారు. ఇప్పుడు ఏ కాంట్రాక్టులో ఎంత డ‌బ్బు వ‌స్తుందో ఆలోచించే చంద్ర‌బాబు నాయుడు గారిని, వేల‌కోట్ల అవినీతి ఆరోప‌ణ‌ల‌తో జైలుకెళ్లొచ్చిన‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లాంటి వారిని ఆద‌ర్శంగా తీసుకోవాలా..? వాళ్లేమైన భ‌గ‌త్ సింగ్‌లా..? లోకేశ్ గారు ఏమైనా సుభాష్ చంద్ర‌బోసా..? వాళ్ల‌ను ఆద‌ర్శంగా తీసుకోవ‌డానికి. పెద్ద‌లు త‌ప్పు చేస్తారు త‌ప్ప యువ‌త ఎప్పుడు త‌ప్పు చేయ‌దు. ఒక‌వేళ త‌ప్పు చేసినా ఆ పాపం మాత్రం నాయ‌కుల‌దే. యథా రాజా తథా ప్రజా అన్నచందంగా ఉన్న‌త‌స్థానంలో ఉన్న‌వాడు ఎలా పాలిస్తాడో అంద‌రికి అదే రాజ‌మార్గం అయిపోతుంది.
 
ఆంద్రోళ్ల‌ను దోపిడిదారులుగా చిత్రీక‌రించి తెలంగాణ నాయ‌కులు తిడుతుంటే నాలుగు ద‌శాబ్దాల అనుభ‌వం అని చెప్పుకునే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌డుగారు గానీ, దొడ్డిదారిన వ‌చ్చి మంత్రి అయిన లోకేశ్ గారుగానీ, అసెంబ్లీకే వెళ్ల‌ని ప్ర‌తిప‌క్ష‌ నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగారు గానీ ఒక్క‌మాట మాట్లాడ‌రు. ఆనాడు ప్ర‌జ‌ల‌ను, పాల‌కుల‌ను వేరు చేయండి అని మాట్లాడింది కేవ‌లం జ‌న‌సేన పార్టీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్ర‌మే. తెలంగాణ దోపిడిలో రాష్ట్రాన్ని పాలించిన రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌బాబుల‌కు పాత్ర ఉంది కానీ, ప్ర‌జ‌ల పాత్ర‌ ఏముంది. మా శ్ర‌మ‌, సంప‌ద‌ను పెట్టుబ‌డిగా పెట్టి హైద‌రాబాద్ పున‌ర్నిర్మాణానికి పాటుప‌డితే మ‌మ్మ‌ల్ని ద్వితీయ‌శ్రేణి పౌరులుగా చూసి అవ‌మానించారు. పిడికెడు గుండె ధైర్యం లేని ఇలాంటి నాయ‌కుల‌ను చూసి క‌డుపుమండి ఓటు అనే బ‌ల‌మైన ఆయుధాన్ని తీసుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను.
 
నీరు, నిధులు దోచేస్తున్నార‌ని, భాష‌, యాస‌ల‌ను అవ‌మానప‌రిచార‌ని తెలంగాణ నాయకులు ఉమ్మ‌డి రాష్ట్రాన్ని రెండు ముక్క‌లు చేశారు. ప‌చ్చ‌టి కోన‌సీమ‌లో వేలకోట్లు విలువ చేసే స‌హ‌జ‌వ‌న‌రులు రిల‌య‌న్స్ సంస్థ‌లు దోచుకెళ్తుంటే నాయ‌కులు ఎందుకు ప్ర‌శ్నించరు. అంబానీల‌ను ఎదురించాలంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కేసుల భ‌యం, చంద్ర‌బాబునాయుడు గారికి ఏం భ‌యాలున్నాయో తెలియ‌దు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీగానీ మా యువ‌త‌కు ఉద్యోగాలు ఎక్క‌డ అని అడ‌గ‌రు. గ్యాస్ బ్లో అవుటై ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు పోతుంటే ఒక్క‌డికీ అడిగే ద‌మ్ములేదు. ఇలాంటి టీడీపీ నాయ‌కులు ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడే నాయ‌కులా..? వారి ఎంపీల‌ను కొడుతుంటే తెలుగువారిని కొడుతున్నార‌ని నాకు బాధేసింది. నాకు వ‌చ్చిన కొద్దిపాటి పౌరుషం కూడా చంద్ర‌బాబు, లోకేశ్ గారికి రాలేదు. వీరికి ఆత్మ‌గౌర‌వం అనే ప‌దానికే అర్ధమే తెలియ‌దు. వారికి తెలిసింద‌ల్లా అడ్డ‌గోలుగా దోచేయ‌డం.
 
కోన‌సీమ‌లో గ్యాస్ ప్ర‌మాదం జ‌రిగి ప్ర‌జ‌లు కాలిపోతే, వారికి అందించాల్సిన సాయం నేటికీ అంద‌లేదు. రిల‌య‌న్స్‌, ఓఎన్‌జీసీ, గుజ‌రాత్ గ్యాస్ కార్పొరేష‌న్లు మీ ల‌బ్ది కోసం 30 అడుగులు వేయాల్సిన పైపులు మూడు అడుగు లోతుకి వేస్తే, చూస్తూ ఊరుకోవాలా.? ఇలాంటి ప‌రిస్థితుల్ని మార్చాలి. 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ప‌ది స్థానాల్లో గెలిచినా స‌భ‌లో కూర్చుని బాధితుల త‌రుపున పోరాడేవాడిని. ముఖ్య‌మంత్రి అయితేనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారిస్తా అంటే ఎలా.? అలాంట‌ప్పుడు పార్టీ ఎందుకు పెట్టారు.. గెలుస్తామా లేదా అన్న ఆలోచ‌న లేకుండా బాధ్య‌త‌తో కూడిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని తేవాలి. 2019లో జ‌న‌సేన పార్టీ అలాంటి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు