వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముక్కుసూటిగా ఓ ప్రశ్న సంధించారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయసాయి రెడ్డి చదివింది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టు కాదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న వైఎస్ఆర్ మ్యాండేట్.. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా? ఆమె సూటిగా ప్రశ్న సంధించారు.
ఇదే అంశంపై ఆమె ఆదివారం తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్ఆర్ మాత్రమే. బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరన్నారు.
వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణం అయితే మీరు అధికారంలో ఉండి ఐదేళ్లు ఏం గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు? అనుమానం ఉండి, ఐదేళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క విచారణ కూడా వేయ్యలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
వైఎస్ఆర్ మరణం తర్వాత చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా? కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి ఈ కుట్ర చేయలేదా? చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపునాగు జగన్ కాదా? అని అడిగారు.