టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా పప్పులో కాలేశారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఓటర్లతో పాటు... ఆయన పక్కన ఉన్న నేతలంతా ఒక్కసారి ఖిన్నులయ్యారు. ఆ తర్వాత పక్కనవున్నవారు హస్తం గుర్తు కాదు.. సైకిల్ గుర్తు అని గుర్తు చేయడంతో అహ్హ హ్హ హ్హ హ్హా అంటూ నవ్వి సరిపెట్టుకున్నారు.
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, అనంతపురం జిల్లా నారాయణపురంలో తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డికి అనుకూలంగా జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన ప్రచార రథంపై నుంచి ప్రసంగిస్తూ, తాను నిధులు మంజూరు చేయించగలిగానని, కానీ, అభివృద్ధి పనులు చేయలేక పోయినట్టు చెప్పారు. అయితే, తన కుమారుడుని గెలిపిస్తే మాత్రం నిధులతో పాటు పనులను కూడా పూర్తి చేయిస్తాడని, అందువల్ల హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన తనకు ఆ పార్టీపై మమకారం ఇంకా చావలేదన్నారు. అందుకే తాను ఇలా మాట్లాడుతున్నానని తన మనసులోని మాటను చెప్పారు. హిందీ రాకపోవడం వల్ల ఎంపీగా ఫెయిల్ అయ్యానని అంగీకరించారు. తన కుటుంబం గద్వాల్ నుంచి వలస వచ్చిన మాట వాస్తవమేనని, తన స్థానికతను ప్రశ్నించొద్దని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.