సీటు ఇవ్వకుండా జగన్ అడ్డుకున్నారు... రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా? : ఆర్ఆర్ఆర్

వరుణ్

సోమవారం, 25 మార్చి 2024 (11:53 IST)
తనకు లోక్‌సభ టిక్కెట్ ఇవ్వకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్ అడ్డుకున్నారని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అలియాస్ ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున నరసాపురం స్థానం నుంచి ఆర్ఆర్ఆర్ పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా బీజేపీ టిక్కెట్ ఇస్తుందన్న గట్టి నమ్మకంతోనే ఉన్నారు. కానీ, బీజేపీ ప్రకటించిన ఆరుగురు అభ్యర్థుల పేర్లలో ఆయన పేరు లేదు. 
 
దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, నరసాపురం సీటు నుంచి తనకు అవకాశం దక్కకుండా సీఎం జగన్ అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని, రఘురామకృష్ణరాజుకు బీజేపీ నుంచి టికెట్ రానివ్వరని ముందే కొందరు చెప్పారన్నారని ఆయన ప్రస్తావించారు. బీజేపీ తరపున సీటు దక్కకపోయినా సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని రఘురామకృష్ణరాజు తెలిపారు. 
 
తాను రాజకీయాల్లోనే ఉంటానని, జగన్‌కు తగిన గుణపాఠం చెబుతానని మండిపడ్డారు. సీఎం జగన్ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మొదటి నుంచి దండెత్తిన తనకు అటు బీజేపీ, ఇతర పార్టీల నుంచి అవకాశం లేకుండా చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఓ బీజేపీ నేత ద్వారా జగన్ సీటు రానివ్వలేదు. జగన్ ప్రభావంతో నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదని, కొందరు బీజేపీ నేతలతో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని, ఓ నేత ద్వారా టికెట్ రాకుండా అడ్డుకోగలిగినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. 
 
నరసాపురం నుంచి పోటీచేస్తానా? ఇంకేదైనా స్థానమా అనేదానికి కాలమే సమాధానం ఇస్తుందని అన్నారు. పనికిమాలిన వైసీపీలో చేరి ప్రజలకు అన్యాయం చేశాననే భావనతో ప్రాణాలకు తెగించి పోరాటం చేశానని పేర్కొన్నారు. తనకు సీటు దక్కకపోయినప్పటికీ జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వబోనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ చీప్ ట్రిక్స్ పనిచేయబోవని పేర్కొన్నారు. రాజకీయాలు క్రూరంగా ఉంటాయని తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్ష అనుభవపూర్వకంగా తెలిసివచ్చిందని రఘురామరాజు వ్యాఖ్యానించారు. నరసాపురం టికెట్ రానందుకు తన అభిమానులు మనస్తాపం చెందవద్దని ఆయన సూచించారు. తాను ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ఎన్డీయే విజయం సాధిస్తుందని, చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు