ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు అవినీతితో సంపాదించిన ఆస్తులు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. 1988 మే 11వ తేదీన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిన జీవీ రఘు అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1996లో డిప్యూటీ డైరెక్టర్‌గా ఆయన ప్రమోషన్ పొందారు. ఆ హోదాలో నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్‌లో పనిచేశారు.
ఆ తర్వాత 2002లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు సిటీ ప్లానర్‌గా వచ్చారు. మళ్లీ 2004లో జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది విశాఖ జీవీఎంసీకి బదిలీ అయ్యారు. 2009 నవంబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ సిటీ ప్లానర్‌గా పనిచేశారు. అక్కడే డైరెక్టర్‌గా ప్రమోషన్ అందుకున్నారు. చివరగా 2015లో డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్‌గా ప్రమోషన్ పొందారు. మరో వారం రోజుల్లో ఆయన రిటైర్ కానున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిఘా వేసిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో రఘు అతని బినామీలు, బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో బయటపడ్డ ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు. సుమారు 500 కోట్ల రూపాయల అక్రమాస్తులు చూసి నోరెళ్ల బెట్టారు.
ఇదిలావుండగా, అక్రమంగా ఆస్తులు సంపాదించిన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ జీవీ రఘు, మున్సిపల్ కార్పొరేషన్ టెక్నికల్ ఆఫీసర్ శివప్రసాద్ ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్నారు. వీరిద్దరిని ఏసీబీ అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. నిందితులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ రూ.45 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. కానీ మార్కెట్ విలువ ప్రకారం రూ.400 నుంచి 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.