ఎన్నికలపై పెట్టి శ్రద్ధ కరోనాపై లేదు.. ఏపీ సర్కారుపై అఖిల ప్రియ ఫైర్

బుధవారం, 22 ఏప్రియల్ 2020 (16:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిల ప్రియా రెడ్డి మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల నిర్వహణపై పెట్టిన దృష్టి కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్టపై సారించలేదని ఆమె ఆరోపించారు. ఈ కారణంగానే ఏపీలో ముఖ్యంగా కర్నూలు జిల్లాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. 
 
ఈ క్రమంలో ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియో రూపంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ఈ రోజు మన రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కారణమేంటనే విషయాన్ని పరిశీలిస్తే అందుకు మొదటి కారణం.. మన ప్రభుత్వం కరోనాను తక్కువగా అంచనా వేయడమే. మన దేశంలో కరోనా కేసులు పెరిగిపోతోన్న సమయంలో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిల్లీగా తీసి పడేసింది. అది మామూలు జ్వరమేనని ప్రకటించింది. పారాసిటిమల్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పింది. 
 
ఈ తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే ఏపీలో కరోనా పెరిగిపోతోంది. ప్రభుత్వ తీరులో ప్రజలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనాను చాలా లైట్‌గా తీసుకున్నారు. కరోనా విజృంభణతో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసింది. అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది' అని అఖిల ప్రియ తెలిపారు. 
 
'సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికలపై పెట్టిన దృష్టిని కరోనాపై పెట్టలేదని అర్థమవుతోంది. పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు చేస్తోన్న పనులతో రాష్ట్రంలో కరోనా పెరిగిపోతోంది. అధికారులు తమ పనులను పక్కనపడేసి వైసీపీ నేతల వెనుక నిలబడి వారు చేస్తోన్న ఆర్భాటాలను చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది' అని మండిపడ్డారు. 

 

pic.twitter.com/tZb7PXNY4r

— Bhuma Akhila Reddy (@bhuma_akhila) April 22, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు