పిన్నెల్లి సోదరులకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. ముందస్తు బెయిల్‌కు నో

ఠాగూర్

శుక్రవారం, 29 ఆగస్టు 2025 (12:58 IST)
పల్నాడు జిల్లాకు చెందిన వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో తేరుకోలేని దెబ్బతగిలింది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వారిద్దరూ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. వారి పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెదేపా నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్యలో పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షి, మృతుల బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు నిందితులపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. 
 
ఏ1గా జవిశెట్టి శ్రీను ఎలియాస్‌ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను పేర్కొన్నారు. అయితే, జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్యలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల పాత్ర ఉందని, అందుకు ఆధారాలున్నాయని పోలీసుల తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఆగస్టు 21న హైకోర్టులో వాదనలు వినిపించారు. 
 
'హత్య వెనుక పిటిషనర్ల కుట్ర, ప్రోద్బలం ఉన్నాయి. నిందితులు ఓ రెస్టారెంట్‌లో సమావేశమై హత్యకు కుట్రపన్నారు. హత్యలో పాల్గొన్న వ్యక్తులతో పిన్నెల్లి సోదరులు ఫోన్‌లో మాట్లాడుతుంటారు. ఇందుకు సాంకేతిక, ఫోన్‌కాల్‌ రికార్డు ఆధారాలున్నాయి. సర్పంచ్‌ పదవికి పోటీచేస్తే తాము మద్దతిస్తామని మొదటి నిందితుడికి పిటిషనర్లు హామీ ఇచ్చారు. వాస్తవాలను వెలికితీయాలంటే వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(ఏ6), ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి(ఏ7)ని కస్టడీలోకి తీసుకొని విచారించాలి. వారు ఆర్థికంగా, రాజకీయంగా బలవంతులు. బెయిలిస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారు. వారి ముందస్తు బెయిలు పిటిషన్లను కొట్టేయాలి' అని విజ్ఞప్తి చేశారు. 
 
ఆగస్టు 21న జరిగిన విచారణలో ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రకటించారు. తాజాగా పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు