ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకమైన సంగతి తెలిసిందే. తొలిరోజు మీడియా సమావేశాల్లో నూతన అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా నిలిచారు. మూడు రాజధానుల అంశం సహా పలు ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలనే ఒక్కసారిగా వేడెక్కించారు. ఏపీలో జనసేనతో కలిసి ఎలా ప్రయాణం చేయబోతున్నారు అన్న దానిపై కూడా సూచన ప్రాయంగా స్పందించారు.
ఆ రాజకీయ విషయాలు పక్కనబెడితే సోము వీర్రాజు గురువారం (నేడు) మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసి చిరంజీవి ఆశీర్వచనాలు పొందారు. అనంతరం చిరంజీవి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా నియామకం అయినందుకు వీర్రాజుని అభినందించారు. ఇరువురు రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
కేంద్ర-రాష్ట్ర రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచన చేస్తూ 2024లో బిజెపి, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు చిరంజీవి గారు. వీర్రాజు గారితో పాటుగా ప్రముఖ నిర్మాత ఎస్ వి. బాబు కూడా ఉన్నారు.