ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు, భువనేశ్వరి... వీరిద్దరూ పవర్‌ఫుల్.. వీరిద్దరి మధ్య తాను నలిగిపోతున్నా అంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటూ చలోక్తులు విసిరారు. హీరో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలయ్యకు అభినందనలు తెలుపుతూ ఆయన సోదరి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. బాలకృష్ణతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. వృత్తిపట్ల బాలయ్యకు ఉన్న నిబద్ధత గురించి మాట్లాడారు. 'ఒక పక్కన బాలయ్య.. మరోపక్కన అంతే పవర్‌ఫుల్ భువనేశ్వరి.. ఇద్దరి మధ్య ఇప్పుడు నేను నలిగిపోతున్నా (నవ్వులు). వీరిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదం. నిన్నటి వరకూ అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య. దేశం గర్వించదగ్గ బిడ్డ.
మా కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులందరం ఎంతో గర్వపడుతున్నాం. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. ఇదొక అన్‌స్టాపబుల్ ప్రయాణం. ప్రతి ఒక్కరూ జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకోవాలనుకుంటారు. ఒకే రంగంలో రాణిస్తుంటారు. కానీ, బాలయ్య వివిధ రంగాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1974లో తొలిసారి ఆయన సినిమాల్లోకి వచ్చారు. 78లో నేను తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. అంటే నాకంటే ఆయన నాలుగేళ్లు సీనియర్'
'నందమూరి తారక రామారావు గారు ఒక చరిత్ర సృష్టించారంటే పట్టుదల, క్రమశిక్షణతోనే సాధ్యం. బాలయ్యపైకి అల్లరిగా కనిపిస్తాడు. కానీ లోపల ఎంతో క్రమశిక్షణ ఉంది. ఒక్కోసారి మూడు గంటలకే నిద్రలేచి పూజలు చేస్తాడు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటివి నావల్ల కాదు. 50 ఏళ్లుగా సినిమాల్లో ఎవర్‌గ్రీన్ హీరోగా రాణిస్తున్నారు. నేటితరం దర్శకులతో కలిసి విభిన్నమైన చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు.
ఆయనలో గొప్ప మానవతావాది ఉన్నారు. క్యాన్సర్ ఆస్పత్రి బాధ్యతలు ఆయన స్వీకరించిన తర్వాత దేశంలోని గొప్ప ఆస్పత్రుల్లో ఒకటిగా పేరు సొంతం చేసుకుంది. అందుకు గర్వపడుతున్నా. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎంత ఎమోషనల్‌గా ఉంటాడో అంత మంచి మనిషి. నాకొక అద్భుతమైన బావమరిది దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా' అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్, గోపీచంద్ మలినేని వంటి సినీ ప్రముఖులు పాల్గొని చంద్రబాబుతో ఫొటోలు దిగారు. సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.