ఏపీలో నేడు టెట్ ఫలితాలు రిలీజ్ : మంత్రి నారా లోకేశ్

ఠాగూర్

సోమవారం, 4 నవంబరు 2024 (09:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను సోమవారం వెల్లడించనున్నారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించేందుకు కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలో టెట్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం చేసింది. 
 
రాష్ట్రంలో గత నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ నిర్వహించగా, 3.68 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. నిజానికి ఈ ఫలితాలు ఈ నెల రెండో తేదీనే విడుదల కావాల్సివుంది. కానీ, మంత్రి విదేశీ పర్యటనలో ఉండటంతో నాలుగో తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యా మంత్రి తన అమెరికా పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకోవడంతో ఆయన చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. 

నేడు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. యేడాదిలో రెండోసారి... 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. టెట్ పరీక్ష నిర్వహణ కోసం మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. యేడాదికి రెండుసార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు సోమవారం రెండో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ యేడాది మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షకు 2.35 లక్షల మంది హాజరయ్యారు. తాజాగా విడుదల చేయనున్న టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన రాత పరీక్ష వచ్చే యేడాది జనవరి నెలలో ఉండే అవకాశం ఉంది. టెట్-1 పేపర్‌కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసినవారు అర్హులు. 
 
ఈ యేడాది రెండోసారి నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగ లోపా లేదా సంక్రాంతి తర్వాత నిర్వహించాలా అనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పరీక్షల కోసం వారం, పది రోజుల పాటు స్లాట్లు అవసరం. ఈ నేపథ్యంలో అవి దొరికే సౌలభ్యాన్నిబట్టి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. 
 
మే నెలలో నిర్వహించిన 2.35 లక్షల మంది హాజరుకాగా 1.09 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక టెట్-1 పేపర్‌కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం టెట్ అర్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్ పరీక్షను నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు