ముగిసిన విచారణలు : సీఎం జగన్ బెయిల్ రద్దు అయ్యేనా? 25న తీర్పు

శుక్రవారం, 30 జులై 2021 (14:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలు శుక్రవారం ముగిశాయి. కానీ, తీర్పును మాత్రం వచ్చే నెల 25వ తేదీకి కోర్టు వాయిదావేసింది. 
 
కోర్టు విధించిన షరతులను సీఎంజగన్ ఉల్లంఘించారనీ, అందువల్ల బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
 
పలు దఫాలుగా విచారణ జరుగగా, మరోమారు శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషన్‌పై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ విన్నపం పట్ల రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వెంకటేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఇప్పటికే పలుమార్లు సమయం కోరారని... ఇప్పటి వరకు సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చారని, ఇకపై గడువు ఇవ్వొద్దని కోరారు. దీంతో కోర్టు స్పందిస్తూ శుక్రవారం ఏదో ఒకటి సీబీఐ చెప్పాలని, దీనికి కొంత సమయం ఇస్తామని చెప్పింది.
 
కాసేపటి తర్వాత సీబీఐ తరపు న్యాయవాది వచ్చి, ఈ కేసులో ఇకపై తాము ఎలాంటి వాదనలు వినిపించబోవడం లేదని... జగన్ బెయిల్ రద్దు చేయాలా? వద్దా? అనే నిర్ణయాన్ని విచక్షణ మేరకు కోర్టు తీసుకోవాలని కోరారు. అనంతరం ఈ కేసులో విచారణ ముగిసిందని జడ్జి ప్రకటించారు. ఆగస్టు 25న తుది తీర్పును వెలువరిస్తామని చెప్పారు. దీంతో, సీబీఐ కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వెలువడనుందో అనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు