జగన్ బెయిల్‌ రద్దుపై విచారణ : ఊపిరి పీల్చుకున్న సీఎం.. సీబీఐ ఉదారత...

గురువారం, 8 జులై 2021 (15:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదాపడింది. ఈ నెల 14వ తేదీకి సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదావేసింది. పలు అక్రమాస్తుల కేసుల్లో ఏ1 నిందితుడుగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్... తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేస్తున్నారనీ, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు రిజాయిండర్ కూడా వేశారు. తన కేసుల్లో తనతో పాటు నిందితులుగా ఉన్నవారికి జగన్ మేళ్లు చేశారని, సాక్ష్యులను బెదిరించేందుకు పలు మార్గాల్లో ప్రయత్నించారని రఘురామ వివరించారు. జగన్ బెయిల్ రద్దుకు ఈ కారణాలు సరిపోతాయన్నారు. ముఖ్యంగా, జగన్‌కు బెయిల్ ఇవ్వడం వల్ల బాధితులుగా మారినవారిలో తాను కూడా ఉన్నానని స్పష్టం చేశారు.
 
ఈ పిటిషన్ పై హైకోర్టులో గత కొన్ని నెలలుగా విచారణ జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో గురువారం కూడా మరోమారు విచారణకు వచ్చింది. ఆ సమయంలో తమ వాదనలను జగన్, రఘురామ లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. అయితే, తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోవడంలేదని సీబీఐ అధికారులకు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు