రాజధాని రైతులను బేడీలు వేసి పోలీసులు కోర్టుకు తరలించారు. పోలీసుల చర్య పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు ఈ నెల 22న పలు ఆందోళనలు చేయడం, మూడు రాజధానులకు మద్ధతుగా తమకు రాజధాని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ మరికొంతమంది నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఇరుగ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రవి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలేనికి చెందిన ఏడుగురు రైతులపై పోలీసులు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
తరువాత జరిగిన చర్చల్లో రవి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని చెప్పినా పోలీసులు నిరాకరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత కేసు వెనక్కి తీసుకోవడం కుదరదని, కోర్టులో తేల్చుకోవాలని డిఎస్పి దుర్గాప్రసాద్ తేల్చి చెప్పారు. కృష్ణాయపాలేనికి చెందిన ఏడుగురు రైతులను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో ఈ నెల 26న హాజరు పర్చారు.
అన్నదాతకు బేడీలా?: చంద్రబాబు నాయుడు
కృష్ణాయపాళెం దళిత, బిసి, తదితర రైతులపై ఎస్సీ అట్రాసిటి కేసు పెట్టడం సరైంది కాదని పిర్యాదుదారుడైన ఈపూరు రవి పోలీసులను కోరారు. తాను పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోమని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.