రేగులపాలెం స్టేషన్‌లో 2 గంటలు నిలిచిపోయిన బోకోరో ఎక్స్‌ప్రెస్.. ఎందుకంటే..?

ఆదివారం, 20 నవంబరు 2022 (11:37 IST)
ధన్‌బాద్ నుంచి అలెప్పీ వెళ్లే బొకొరో ఎక్స్‌ప్రెస్ అనకాపల్లి జిల్లా రేగులపాలెం వద్ద రెండు గంటల పాటు నిలిచిపోయింది. రిజర్వేషన్ సీట్ల విషయంలో ప్రయాణికుల మధ్య తలెత్తిన గొడవ కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీనిపై తుని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. వివిధ రకాల పనుల నిమిత్తం వెస్ట్ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది కూలీలు విజయవాడకు వస్తున్నారు. వీరంతా ముందస్తు రిజర్వేషన్ చేసుకోకుండానే రిజర్వేషన్ బోగీల్లో ఎక్కి కూర్చొన్నారు. 
 
ఈ రైలు శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో అనకాపల్లికి చేరుకుంది. అక్కడ రిజర్వేషన్ చేసుకున్న అయ్యప్ప భక్తులు అనేక మంది ఎక్కారు. బోగీల్లో తాము రిజర్వేషన్ చేసుకున్న సీట్లలో అప్పటికే కూర్చొనివున్న ప్రయాణికులు ఖాళీ చేయాలని కోరారు. 
 
అయితే, వారు అందుకు ససేమిరా అన్నారు. టీసీకి తాము డబ్బులు చెల్లించామని, అందువల్ల తమ సీట్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇంతలో రైలు అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రేగులపాలెం స్టేషన్‌కు చేరుకుంది. అదేసమయంలో రైలులో ప్రయాణికులు గొడవపడుతున్నారన్న విషయం రైల్వే ఉన్నతాధికారులకు తెలిసింది. 
 
దీంతో రైలును రేగులపాలెం స్టేషన్‌లో నిలిపివేసి.. రిజర్వేషన్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని కిందికి దించేశారు. దీంతో ఆగ్రహించిన వారు రైలు ఇంజిన్ ముందు పట్టాలపై కూర్చొని ఆందోళనకు దిగారు సమాచారం అందుకున్న తుని పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి.. వారిని ఇతర అన్‌రిజర్వుడ్ బోగీల్లోకి ఎక్కించారు. ఆ తర్వాత రైలు బయలుదేరింది. ఈ కారణంగా రైలును 2 గంటల పాటు రేగులపాలెం రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు