కుక్కకు కాంస్య విగ్రహం - వర్థంతికి అన్నదానం... ఎక్కడ?

శనివారం, 24 జులై 2021 (09:43 IST)
నేటి సమాజంలో మనుషుల కంటే పెంపుడు కుక్కలే విశ్వాసంగా, నమ్మినబంటుల్లా ఉంటున్నాయి. అందుకే ఇపుడు ఇంట్లో పెంపుడు కుక్కల పెంపకం అధికమవైంది. చాలా మంది ధనవంతులు, మధ్యతరగతి ప్రజల ఇళ్లలో పెంపుడు శునకాలు అధికంగా కనిపిస్తున్నాయి. 
 
పైగా, ఈ మూగ జంతువులపై మనం ఎంత ప్రేమ చూపిస్తే అవి మనకు అంత విశ్వాసంగా పనిచేస్తాయని నమ్మకం. అందుకే చాలా చోట్ల పెంపుడు జంతువుల చనిపోతే వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి తాను పెంచుకున్న కుక్కపై ఎంత మమకారం చూపాడో ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాల్సిందే.
 
జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం అంపాపురంకు చెందిన సుంకర జ్ఞాన ప్రకాశరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారికి వివాహం చేసి అత్తారింటికి పంపాడు. 
 
కూతుళ్లు కాపురానికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉన్న జ్ఞానప్రకాశరావు దంపతులకు ఓ కుక్క పిల్ల దొరికింది. దీంతో దానిని అల్లారు ముద్దుగా సాకారు. కుక్క కూడా సదరు దంపతులను సొంతవారిలా భావించేది. 
 
జ్ఞానప్రకాశరావు బయటకు వెళ్తే తిరిగి వచ్చేవరకు ఆహారం ముట్టేది కాదు. ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే ఆ జ్వరం తగ్గేవరకు ఏం తినేది కాదు. ఆ దంపతులకు కావాల్సిన వస్తువులను నోటితో పట్టుకుని వచ్చేది. దీంతో ఆ మూగ జంతువు చుట్టుపక్కల వారిని కూడా ఆశ్చర్యపరిచేది.
 
అయితే ఐదేళ్ళ క్రితం ఆ కుక్క చనిపోయింది. సాటి మనిషి చనిపోతే పట్టించుకోని ఈ రోజుల్లో ఆ కుక్కకు కాంస్య విగ్రహం కట్టించి జ్ఞానప్రకాశరావు శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి బంధువులను, గ్రామస్తులను ఆహ్వానించి అల్పాహార విందు ఏర్పాటు చేశాడు. ఈ తతంగంతో ఆయనకు తన పెంపుడు జంతువు అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు