విశాఖలో డ్రగ్స్ కంటైనర్ కలకలం : ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోర్టుకు పరుగులు పెట్టిన ఉన్నతాధికారులు!!

ఠాగూర్

శుక్రవారం, 22 మార్చి 2024 (09:50 IST)
విశాఖపట్టణంలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ విషయం తెలియగానే పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటిన పోర్టుకు చేరుకుని హడావుడి చేశారు. అయితే, సీబీఐ అధికారులు మాత్రం వారిని ఏమాత్రం ఖాతరు చేయకుండా తమ పని తాము పూర్తి చేశారు. కాగా, కేంద్ర నిఘా వర్గాలు ఉమ్మడిగా గురువారం రాత్రి ఆపరేషన్ గరుడలో భాగంగా, ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఈ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. సుమారు 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌తో కలిపివున్న కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇందులో కొకైన్ ఎంత మొత్తంలో ఉందో తెలియాల్సివుంది. 
 
బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్టు నుంచి వచ్చిన షిప్ కంటైనర్‌లో ఈ భారీ పరిమాణంలో మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్టు ఇంటర్ పోల్ అధికారులు పక్కా సమాచారాన్ని కేంద్ర నిఘా వర్గాలకు చేరవేశాయి. దీంతో ఢిల్లీలోని సీబీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విశాఖపట్టణంలోని సీబీఐ అధికారులు, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఈ నెల 16వ తేదీన విశాఖ పోర్టుకు చేరుకున్న కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
అందులోని సరకును పరిశీలించేందుకు ఈ నెల 19వతేదీన ఢిల్లీ నుంచి నిపుణలు వచ్చారు. సుమారు 25 వేల కిలోల (ఒక్కో బ్యాగులో 25 కేజీలున్న వెయ్యి బ్యాగులు) ఇన్ యాక్టివ్ డ్రై ఈస్ట్‌తో నార్కోటిక్స్ డ్రగ్స్ కలిపినట్టు నిర్ధారించారు. డ్రగ్స్‍‌తో వచ్చిన కంటైనర్‌ను విశాఖలో ఆక్వా ఎగుమతులు, దిగుమతులు చేపట్టే సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట బుక్ చేసినట్టు సీబీఐ అధికారులు తేల్చారు. ఆ కంపెనీ ప్రతినిధులతో పాటు మరికొందరిపై ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ ముఠా ప్రేమయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దర్యాప్తులో మిగిలిన వివరాలను రాబట్టాల్సివుందని సీబీఐ అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, పోర్టులో డ్రగ్స్ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారన్న వార్త తెలియగానే పోర్టు అధికారులు, ఏపీ ప్రభుత్వానికి చెందిన కొందరు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని సీబీఐ అధికారులు కంటైనర్ తనిఖీ చేయకుండా అడ్డుపడ్డారు. వైకాపా పెద్దల సూచనతో ఆగమేఘాలపై అక్కడికి వచ్చిన ఏపీ అధికారులు విచారణ ముందుకు సాగకుండా ఉండేందుకు విఫలయత్నం చేశారు. సంధ్య సంస్థ ప్రతినిధులు కూడా వర్షం పడేలా ఉందని, బయటకు తీసిన సరకు మళ్లీ కంటైయినర్‌లో పెట్టి, ఆ తర్వాత విచారణ చేసుకోవచ్చని సీబీఐ అధికారులను ప్రాధేయపడ్డారు. అయితే, సీబీఐ అధికారులు వారి విన్నపాలను, బెదిరింపులను ఏణాత్రం లెక్కచేయకుండా తమ వెంట తీసుకెళ్లిన కిట్ల ద్వారా 20 పాలెట్లను పరీక్షించారు. ఇందులో మత్తు పదార్థం కొకైన్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో అధికారులు కూడా అదే విషయాన్ని విచారణ నివేదికలో రాసి, సంధ్య సంస్థ తరపున వచ్చిన వారితో సంతకాలు చేయించారు. 
 
పోర్టులో సీబీఐ విచారణ జరుగుతుందని తెలియగానే ఒక ఐజీ, విశాఖపట్టణం పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ అధికారులు, పోర్టు అధికారులు అంతా అక్కడకు చేరుకున్నారు. ఏపీ రాష్ట్ర అధికారుల్లో కొందరు అక్కడ దొరికిన కొకైన్ శాంపిల్స్ కావాలని కోరారు. దానికి సీబీఐ అధికారులు నిరాకరించారు. సాధారణంగా సీబీఐ విచారణ చేస్తున్నపుడు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అనుమతించరు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు కూడా తెలుసు. కానీ, అధికార వైకాపా పెద్దల ఒత్తిడితోనే వారంతా ఒక్క పరుగుల పోర్టుకు చేరుకుని సంస్థ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి ప్రయత్నించారని, సీబీఐ తన విచారణ రిపోర్టులో పేర్కొంది. దీంతో ఈ డ్రగ్స్ రాకెట్ అంశంలో వైకాపా పెద్దల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు