ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్‌లో తన ఫోటో ఉందని వైకాపా నేతలు ఏడుస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేసమయంలో అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన తాజాగా విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, 'పుష్ప' చిత్రంలో ఎర్ర చందనం స్మగ్లర్‌గా హీరో అల్లు అర్జున్ ఎంతగానో మెప్పించారని అన్నారు. స్మగ్లర్‌గా నటించినందుకు అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు ఇస్తే, వైకాపాని నిజమైన ఎర్ర చందనం స్మగ్లర్లు ఏ అవార్డు ఇవ్వాలని చంద్రబాబును ఓ విలేఖరి ప్రశ్నించారు.
దీనికి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, 'పుష్ప' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్‌లో నా ఫోటో ఉంటుంది. ఆ సినిమాలో చూపించిన కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నానో లేదంటే ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాననో వాళ్లు నా ఫోటో పెట్టి ఉండొచ్చు. దానికే వైకాపా నేతలు ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. 'ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. అలాగే, వివిధ విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకున్న వారందరికీ అభినందనలు' అంటూ సోషల్ మీడియా వేదికగా తన విషెస్ తెలియజేశారు. ఇక 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికినప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్‌లో గోడకు చంద్రబాబు ఫొటో ఉంటుంది. అలాగే మరో సన్నివేశంలోనూ ఆయన ఫొటోను చూడొచ్చు. ఈ ఫోటోలనే వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు.