తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలకు స్వల్ప విరామం ఇచ్చారని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ అన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు.
హైదరాబాద్ నగరం ఈ స్థాయికి ఎదగడానికి, ఈ స్థాయిలో నగరానికి సంపాదన రావడానికి బీజం వేసింది చంద్రబాబేనని కొనియాడారు. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో పని చేస్తున్న ఎంతో మంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబును తలచుకుంటున్నారని గుర్తుచేశారు.
చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడు కాదని, ఆయన స్టేట్స్‌మెన్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నో నిద్రలేమి రాత్రులను గడిపారని గుర్తుచేశారు. చంద్రబాబు అధికారానికి ఇపుడు ఇచ్చింది తాత్కాలిక విరామమే కానీ విరమణ కాదన్నారు.