శ్రీకాకుళం జిల్లాలో మాజీ సైనికోద్యోగి పేరుతో వెంకట రమణ అనే వ్యక్తి స్థానికంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరుతో ఓ ట్రైనింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఇక్కడ శిక్షణ పొందుతున్న యువకులను ఆయన చిత్రహింసలకు గురిచేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ అధికారినంటూ వెంకట రమణ అనే వ్యక్తి స్థానికంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి ఒకొక్కరి నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శిక్షణకు వచ్చిన ఓ యువకుడిని సంస్థ డైరెక్టర్ రమణ.. కరెంటు వైరుతో విచక్షణారహితంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను కొందరు నెటిజన్లు మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేసి స్పందించాలని కోరారు. దీనిపై లోకేశ్ వెంటనే స్పందించారు. కారకులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటారని లోకేశ్ పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన 2023 డిసెంబరులో జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.