ఏపీ సచివాలయాన్ని వీడని కరోనా.... 27 మందికి పాజిటివ్

గురువారం, 2 జులై 2020 (15:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని కరోనా వైరస్ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య ఇప్పటివరకు 27కు చేరింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అసెంబ్లీలో కరోనా వైరస్ కేసులు వెలుగు చూసినప్పటి నుంచి ప్రతి రోజూ శానిటైజేషన్ పనులు చేస్తూనే ఉన్నారు. కానీ, ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ బారినపడిన సచివాలయ ఉద్యోగుల సంఖ్య 27కు చేరింది. 
 
ఇదిలావుండగా, ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ప్రభుత్వ యంత్రాంగానికి సవాలు విసురుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 29 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో గుర్తించగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో మరో 4 కేసులు వెల్లడయ్యాయి. దాంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,097కి చేరింది. 
 
తాజాగా 281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తమ్మీద రాష్ట్రంలో 7,313 మంది డిశ్చార్జి కాగా, 6,673 మంది ఆసుపత్రులలో, 1,913 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఇక, గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 198కి పెరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు