దిశ కేసు జగన్ రెడ్డిపైనే పెట్టాలి: టీడీపీ

మంగళవారం, 9 మార్చి 2021 (09:02 IST)
దిశ కేసు మొదట జగన్ రెడ్డిపైనే పెట్టాలని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మహిళా దినోత్సవం జరుపుకునే పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
చంద్రబాబు ప్రభుత్వంలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే 12 బృందాలు వేశామని, దాన్ని చూసి భయపడి సుబ్బయ్య అనే వ్యక్తి ఉరేసుకుని చనిపోయాడని గుర్తు చేశారు. ఇప్పటి రాష్ట్రంలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఒక్కనాడైనా జగన్ బయటకు వచ్చి స్పందించరా? అని ప్రశ్నించారు.

నెల్లూరులో సెల్లాదేవి ఇంట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాములు వదిలారని, వాలంటీర్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు బిడ్డలకు తండ్రిగా ఉన్న జగన్ కు ఆడబిడ్డలపై జరుగుతున్న ఆకృత్యాలు కనబడటంలేదా? అని ప్రశ్నించారు.  దిక్కులేని దిశ చట్టం గురించి మాట్లాడాలంటే సిగ్గుగా వుందన్నారు.

దిశ స్టేషన్లు రంగులు వేసుకుని, కమీషన్లు దండుకోవడానకే పనికొచ్చాయని విమర్శించారు. అమరావతి మహిళలు రోడ్ల మీద అన్నం తినే స్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మహిళల పట్ల వాడే పదజాలం అసభ్యంగా వుందన్నారు. ఖాకీ చొక్కా పక్కనబెట్టి ఆ మాట్లాడితే మహిళలు తోలు తీస్తారని హెచ్చరించారు.

మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆడకూతుర్లు ఉన్నారని, వాళ్లకు కూడా ఈ దుస్థితి వస్తే చూస్తూ ఊరుకుంటారా? అని నిలదీశారు. మహిళలను గోళ్లతో రక్కి, కడుపులో తన్నించిన దుష్టుడు జగన్ అని మండిపడ్డారు.  హోంమంత్రి రబ్బరు స్టాంపులాగా మారారని, వైసీపీలోని మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టడానికి, రిబ్బన్లు కట్ చేయడానికే ఉన్నారని ఎద్దేవా చేశారు.

భజన చేస్తున్న ఎమ్మెల్యేలకు ఒక్క సారన్నా మహిళల రోధన వినబడలేదా అని ప్రశ్నించారు. అన్యాయం జరిగి న్యాయం చేయమంటే రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో గుండె ధైర్యంతో పోరాడితేనే ఆడబిడ్డలకు రక్షణ వుంటుందని పిలుపునిచ్చారు. రాజారెడ్డి రాజ్యాంగానికి నేటి నుండే చరమగీతం పాడాలని అన్నారు.
 
రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి మాట్లాడుతూ సీఎం జగన్ మహిళల మధ్యకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదన్నారు. వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ తల్లి పడిన రోధన చూస్తే గుండె తరక్కుపోయిందని అన్నారు. వీధివీధి తిరిగి తన బిడ్డకు న్యాయం చేయాలని అడిగిన ఆమెను చూసైనా జగన్ రెడ్డి మనసు కరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దైవ దర్శనానికి వెళ్తున్న అమరావతి మహిళల పట్ల పోలీసు దౌర్జన్యానికి దిగడం సిగ్గుచేటని విమర్శించారు. తక్షణమే మహిళలకు పోలీసలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధం అంటూ కల్తీ మద్యాన్ని తెచ్చి సామాన్యులు ప్రాణాలు తోడేస్తున్నారని విమర్శించారు. వుండవల్లి శ్రేదేవి గుండె ఒక్కసారైనా దిశ అని కొట్టుకోలేదా? అని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు