వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. "ముఖ్యంగా ఈ రోజు మన దేశంలో డాక్టర్స్ డే ని జరుపుకొంటున్న ఈ తరుణంలో వైద్యులందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు, పశ్చిమ బెంగాల్ కు రెండో ముఖ్యమంత్రిగా పని చేసిన బిధాన్ చంద్ర రాయ్ దేశానికి అందించిన వైద్య సేవలను గౌరవిస్తూ ఆయన జయంతి అయిన జులై 1 వ తేదీన మనం డాక్టర్స్ డే గా ఏటా నిర్వహించుకొంటున్నాం. కోవిడ్-19 దేశంలో లక్షలాది మందిని చుట్టుముట్టింది.
వేల మందిని పొట్టన పెట్టుకుంటుంది. కరోనా సోకిన వ్యక్తి పక్కన ఉంటేనే క్షణాలలో వ్యాధి వ్యాపిస్తున్న తరుణంలో నిత్యం కరోనా రోగులకు సేవచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాతః స్మరణీయులే. వారికి మొక్కినంత మాత్రాన సరిపోదు. వారి అవసరాలను తీర్చ వలసిన భాద్యత ప్రభుత్వం, సమాజంపై వుంది. వారి రక్షణకు కావలసిన సకల ఏర్పాట్లు ప్రభుత్వం ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయవలసి వుంది.
వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. డాక్టర్లు, వైద్య సిబ్బందికి అద్దెకు ఇల్లు ఇచ్చినవారు అక్కడక్కడా అమానుషంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటివి చోటుచేసుకోకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.