స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

ఠాగూర్

మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (09:30 IST)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. సింగపూర్‌లోని సింగపూర్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేస్తున్న చిన్నకుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. 
 
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. 
 
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌కి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటాన’ని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. 
 
అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు