తెలంగాణలో మరో నలుగురు పోలీసులకు కరోనా!

శనివారం, 23 మే 2020 (22:23 IST)
తెలంగాణలో కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాజధానిలో మరో నలుగురు పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా తేలారు. 
 
ప్రస్తుతం వీరు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని కాచీగూడ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐ, వివిధ స్టేషన్లకు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎస్‌ఐ కుంటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. 
 
అయితే దీన్ని పోలీసు అధికారులు ధృవీకరించాల్సి ఉన్నది. ఎస్‌ఐకి కరోనా పాజిటివ్‌ రావడంతో కాచీగూడ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నవారందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
 
కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన దయాకర్‌ రెడ్డి అనే కానిస్టేబుల్‌ కరోనా వైరస్‌తో బుధవారం రాత్రి మరణించారు. దీంతో ఈ స్టేషన్‌లో పనిచేస్తున్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారికి నెగెటివ్‌ వచ్చింది.

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఈ రోజు మధ్యాహ్నం కుల్సుంపుర స్టేషన్‌ను సందర్శించారు. కరోనాతో మరణించిన దయాకర్‌ రెడ్డికి ఆయన నివాళులర్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు