జగన్, పవన్‌లు బీజేపీ పంజరంలో రామచిలుకలు... డొక్కా మాణిక్యవరప్రసాద్

సోమవారం, 9 జులై 2018 (22:19 IST)
అమరావతి : జగన్, పవన్, ఐవీఆర్ కృష్ణారావు, రమణదీక్షితులు... బీజేపీ పంజరంలో చిక్కుకున్న రామచిలుకలని, వాళ్లు ఆ పార్టీ పలుకులే పలుకుతున్నారని ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. అడ్డదారిలో ఎన్నికయ్యారంటూ ఎమ్మెల్సీలను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గేలి చేయడం రాజ్యంగం విరుద్ధమని, ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని ఆయన హితవు పలికారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ చేస్తున్న అనేక కుట్రలతో రాష్ట్రంలో కొన్ని పార్టీలు డ్యాన్స్ చేస్తున్నాయన్నారు. 
 
పునర్విభజన చట్టంతో పాటు ఎన్నికల ముందుకు ఇచ్చిన అనేక హామీలిచ్చి విస్మరించిన కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, రేయింబవళ్లు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ను జగన్, పవన్, ఐవీఆర్ కృష్ణారావు, రమణదీక్షితులు విమర్శించడం సరికాదన్నారు. వాళ్లంతా బీజేపీ పంజరంలో చిక్కుకున్న రామచిలుకలన్నారు. నరేంద్రమోడి, బీజేపీ మాటలు, పదాలనే వారు పలుకుతున్నారన్నారు. మేధావి వర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటున్న ఐవీఆర్ కృష్ణారావు రాష్ట్రమంతటా తిరుగుతూ, రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాన్ని అవమానిస్తూ మాట్లాడటం తగదన్నారు. సీఎస్‌గా ఉన్నప్పుడు ఇవేవీ తప్పులుగా కనిపించలేదా? అని ఆయనను ప్రశ్నించారు. 
 
జగన్, అమిత్ షాతో రమణదీక్షితులకు కలవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి, పార్లమెంట్ చట్టాల్లో భాగంగా శాసనమండలి, రాజ్యసభలు ఏర్పాటయ్యాయన్నారు. ఆ రెండింటి నుంచి ఎందరో ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారన్నారు. అటువంటి పెద్దల సభ నుంచి ఎంపికైన వారిని పవన్ కల్యాణ్ తక్కువచేసి మాట్లాడటం సరికాదన్నారు. వాళ్లన్నయ్య చిరంజీవి కూడా పార్లమెంట్‌లో ఎగువసభ అయిన రాజ్యసభ నుంచే ఎంపిగా ఎన్నికై, కేంద్రమంత్రి పదవి చేపట్టిన విషయం ఆయన గుర్తుంచుకోవాలన్నారు. 
 
రాజ్యాంగంలో ఎమ్మెల్సీలు భాగమని, తమను అగౌరపరుస్తూ మాట్లాడితే శాసనమండలి ప్రివిలైజేషన్ మోషన్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పవన్‌ను ఆయన హెచ్చరించారు. విశాఖకు రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీపై మాటతప్పిన కేంద్రాన్ని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ నిలదీశారు. 5 కోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాల కంటే బీజేపీ ప్రయోజనాలే జగన్, పవన్, ఐవీఆర్ కృష్ణారావు, రమణదీక్షితులకు ముఖ్యంగా మారాయన్నారు. వాళ్లంతా నరేంద్ర మోడి చేతిలో కీలుబొమ్మలుగా మారారన్నారు. 
 
దేశంలో ఎక్కడాలేని విధంగా మంత్రి లోకేష్.. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ రహదారుల సౌకర్యం కల్పించారన్నారు. లోకేష్‌ను పవన్ కల్యాణ్ అభినందించాల్సిందిపోయి, విమర్శించడం సరికాదన్నారు. ప్రత్యక్ష ఎన్నకల్లో లోకేష్ పాల్గొనడంపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి పోరాడాలని, లేకుంటే ప్రజలు తిరస్కరిస్తారని జగన్‌కు, పవన్‌కు శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు