మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి కార్యాలయంలో జనాగ్రహ దీక్ష

గురువారం, 21 అక్టోబరు 2021 (11:43 IST)
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి కార్యాలయంలో జనాగ్రహ దీక్షలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గ స్థాయిలో రెండు రోజుల పాటు నిరసనలు చేప‌ట్టారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో జనాగ్రహ దీక్షలు జరుగుతున్నాయి. 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు, పట్టాభి సీఎం జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాలని, లేదంటే జనాగ్రహంలో కొట్టుపోకతప్పదని హెచ్చరించారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై ప్రజాస్వామ్యకంగా విమర్శలు చేసేవారమని, ఇప్పటి చంద్రబాబులా నీచాతి నీచంగా ఎన్నడూ మాట్లాడలేదని అన్నారు.
 
చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకుతిన్నాడని, అందుకే రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు. గడచిన రెండున్నర సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఇప్పటికైనా మారకపోతే 2024 ఎన్నికల్లో ప్రజలు మరొకసారి బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు