దీనిపై కృష్ణా బోర్డు కీలక నిర్ణయాలు వెలువరించింది. భేటీ అనంతరం బోర్డు ఛైర్మన్ పరమేశం మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని సూచించినట్టు తెలిపారు. శ్రీశైలం నుంచి 50:50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. గతంలోనూ అదే నిష్పత్తి అమల్లో ఉండేదని తెలిపారు.
ఇక వరద సమయంలో ఉపయోగించిన జలాలకు సంబంధించిన అంశాలను కమిటీ పరిశీలిస్తోందని వివరించారు. తాగునీటి వినియోగాన్ని 20 శాతం లెక్కింపుపై జల సంఘానికి నివేదించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించినట్టు చెప్పారు. ఏపీలో గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించిన జలాల అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించామని పరమేశం వెల్లడించారు.
కృష్ణా బోర్డును ఏపీ రాజధానికి తరలించే అంశంలో కేంద్ర జలశక్తి శాఖదే తుది నిర్ణయం అని అన్నారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇవ్వాలని స్పష్టం చేశామని... అనుమతులు తీసుకుని డీపీఆర్‌లు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని, అంతేగాకుండా, రెండో దశ టెలిమెట్రీని ప్రాధాన్యతాంశంగా పరిగణించి అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయని వివరించారు.