గుర్తింపు లేనిచోట ఉండలేను.. కేఈ ప్రభాకర్ :: హామీ ఇస్తే వస్తానంటున్న శిద్ధా

శుక్రవారం, 13 మార్చి 2020 (13:18 IST)
తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. కర్నూలు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి, సీనియర్ నేత కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో తన వారికి అన్యాయం జరిగిందన్నది ఆయన బహిరంగ ఆరోపణ. ఇదే అంశంపై ఆయన శుక్రవారం ఉదయం తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత కార్యకర్తల ముందే రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. 
 
తనకు గుర్తింపు లేని చోట ఉండాల్సిన అవసరం లేదని తన అనుచరులతో ఆయన వ్యాఖ్యానించారు. తన అన్న, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితోనూ తనకు జరిగిన అన్యాయం గురించి, స్థానిక ఎన్నికల్లో తన వారికి జరిగిన నష్టం గురించి వివరించానని ఆయన అన్నారు. న్యాయం జరిగే అవకాశం లేదని భావించిన మీదటే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్పష్టంచేశారు. 
 
అలాగే, ప్రకాశం జిల్లాలో కూడా మరో షాక్ తగిలేలావుంది. జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీనియర్ వైసీపీ నేతలతో చర్చలు జరిపిన ఆయన, నేడో, రేపో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
 
అయితే, ప్రకాశం జిల్లాలో శిద్ధాకు దర్శి, పొదిలి ప్రాంతాల్లో అపారమైన అనుచరగణం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారితే వచ్చే లాభ నష్టాలపై ప్రధాన అనుచరులతో చర్చిస్తున్న శిద్ధా, ఇదే విషయాన్ని వైసీపీ పెద్దలకు చేరవేస్తూ, స్పష్టమైన హామీని కోరుతున్నట్టుగా సమాచారం.
 
వైసీపీ పెద్దల నుంచి తాను కోరుకుంటున్న హామీలు లభిస్తే, ఆ పార్టీలో చేరేందుకు సమ్మతమేనని ఇప్పటికే ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పైగా, తన సమకాలీన కర్నూలు నేత కేఈ ప్రభాకర్ కూడా వైసీపీలో చేరేందుకే మొగ్గు చూపుతూ ఉండటంతో, ఇద్దరూ కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారన్న వార్తలూ వస్తున్నాయి. వీటిపై అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది.
 
కాగా, ఇటీవలికాలంలో పలువురు టీడీపీ నేతలు, ఆ పార్టీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరుతున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామసుబ్బారెడ్డి, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి నేతలు జగన్ గొడుగు కిందకు చేరిపోయారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ చేరికలు టీడీపీలో గుబులు పుట్టిస్తున్నాయనడంలో సందేహం లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు