ఏపీ సీఎం జగన్మోహన్... మహావిష్ణువు : తితిదే ప్రధాన అర్చకులు

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తితిదే ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ప్రశంసల వర్షం కురిపించారు. జగన్‌ను మహావిష్ణువుతో పోల్చారు. వంశపారంపర్య హక్కులు కల్పించిన సీఎంకు ధన్యవాదాలు చెప్పేందుకు రమణ దీక్షితులు మంగళవారం సీఎంను కలిశారు. 
 
ఈ సందర్భంగా రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ, 'సీఎం జగన్‌ విష్ణుమూర్తిలా ధర్మాన్ని రక్షిస్తున్నారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరాం. పింక్‌ డైమండ్‌ మాయం అంశం కోర్టులో ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం జరగట్లేదు. తితిదే విషయాలను రాజకీయం చేయడం తగదు' అని తెలిపారు. 
 
పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి అదే స్థానంలో విధుల్లోకి తీసుకోవాలని తితిదే అధికారులు కీలక నిర్ణయం తీసుకోవడంతో.. ఎ.వి.రమణదీక్షితులు ప్రధాన అర్చకులుగా తిరిగి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 
 
65 ఏళ్లు నిండిన అర్చకులకు పదవీ విరమణ ఇస్తూ 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి తీర్మానించింది. దీనికి అనుగుణంగా అప్పటి తితిదే ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణమూర్తి దీక్షితులుతోపాటు మరో 11 మంది పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. 
 
ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ అర్చకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరిలో విధులు నిర్వహించగలిగే శారీరక సామర్థ్యం ఉన్న వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ 2018 డిసెంబరులో హైకోర్టు తీర్పు వెలువరించింది. 
 
అప్పటి నుంచి ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో రమణదీక్షితులు అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులును తిరిగి నియమిస్తామని జగన్‌ నాడు హామీ ఇచ్చారు. 
 
2019లో జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవో ఎంఎస్‌ నంబరు 439 ద్వారా అర్చకులకు పదవీ విరమణ లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు.  దీంతో రమణదీక్షితులుతోపాటు 14 మంది అర్చకులు తిరిగి విధుల్లో చేరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు