ఉద్యోగులు అవసరమైతే కాళ్లు పట్టుకుని పని చేయించుకోవాలి : మంత్రి బొత్స

ఆదివారం, 27 నవంబరు 2022 (19:56 IST)
తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పరితనం ఉండాలని ఏపీ విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ప్రథమ మహా జనసభ కార్యక్రమంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులంటే ప్రభుత్వానికి వ్యతిరేకత లేదన్నారు. 
 
ఏ అంశంపైనా అయినా కూర్చొని మాట్లాడి, పరిష్కరించుకోవాలన్నదే తన విధానమన్నారు. సర్వీస్ రూల్స్ సహా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని ఆయన సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సమస్యలను మంత్రుల ఉప సంఘంలో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. 
 
అవసరమైతే కాళ్లు పట్టుకునైనా సమస్య పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలని హితవు పలికారు. సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద, దండోపాయాలు సహజమేనని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా దండోపాయానికి వెళ్లడం సరికాదని మంత్రి బొత్స అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు