విద్యార్థులను వేధించి రూ.కోట్లలో ఫీజులు వసూలు.. మోహన్ బాబు వర్శిటీ గుర్తింపు రుద్దు చేయాలి...

ఠాగూర్

బుధవారం, 8 అక్టోబరు 2025 (10:58 IST)
సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబుకు చెందిన మోహన్ బాబు యూనివర్శిటీ (ఎంబీయూ) గుర్తింపు రద్దునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విద్యార్థులను వేధించి రూ.కోట్లలో ఫీజులు వసూలు చేసిందని, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే రూ.26.17 కోట్లను అదనంగా వసూలు చేసినట్టు కమిషన్ తన విచారణలో గుర్తించిది. అందువల్ల యూనివర్శిటీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని యూజీసీ, ఏఐసీటీఈ వంటి జాతీయ సంస్థలకు సైతం ప్రతిపాదన పంపించింది. దీంతో యూనివర్శిటీ మనుగడపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పైగా, విద్యార్థుల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. 
 
అధిక ఫీజుల వసూలుపై గత 2024 అక్టోబరులో ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డే-స్కాలర్ల నుంచి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని, హాజరు తక్కువగా ఉందని చెప్పి అదనంగా డబ్బులు గుంజుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నత విద్యా కమిషన్, ప్రత్యేక కమిటీతో విచారణ జరిపింది.
 
తమ వాదన వినిపించిన యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులే స్వచ్ఛందంగా అదనపు ఫీజులు చెల్లించారని చెప్పడం గమనార్హం. అయితే ఈ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. వసూలు చేసిన రూ.26.17 కోట్లను 15 రోజుల్లోగా విద్యార్థులకు తిరిగి చెల్లించాలని పేర్కొంటూనే రూ.15 లక్షల అపరాధం కూడా చెల్లించాలని గతంలోనే ఆదేశించింది. యాజమాన్యం జరిమానా చెల్లించినప్పటికీ, ఫీజుల వాపసు ఆదేశాలను పట్టించుకోలేదు. 
 
ఈ నేపథ్యంలో కమిషన్ ఆదేశాలపై ఎంబీయూ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఫీజుల వాపసు, గుర్తింపు రద్దు సిఫారసును న్యాయస్థానంలో సవాల్ చేసింది. మరోవైపు, ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిని సమీపంలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలికంగా అనుబంధం చేయాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. వర్సిటీ ఆర్థిక అక్రమాలపై ఆదాయపు పన్ను శాఖతో లోతుగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు