ఏడాదిన్నర క్రితం ఎంబీఏ విద్యార్థిని గౌతమి స్కూటీలో వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. గౌతమిని కారుతో ఢీకొట్టి చంపేసి.. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే నరసాపురం జెడ్పీటీసీ బాలం ప్రతాప్ ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులోని మిస్టరీని పరిశీలిస్తే...
నరసాపురానికి చెందిన గౌతమి ఎంబీఏ విద్యాభ్యాసం చేస్తుండగా, ఈమెపై మనసుపడిన మాజీ సర్పంచ్ సజ్జా బుజ్జీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఎన్నిసార్లు గౌతమి అడిగినా, కాపురం పెట్టడానికి బుజ్జీ అంగీకరించలేదు. దీంతో వారిమధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. అదేసమయంలో గౌతమి సోదరి పావనితో బుజ్జీ సమీప బంధువు బొల్లంపల్లి రమేశ్‌కు శారీరక సంబంధం ఉంది.
తనను డబ్బుల కోసం పావని వేధిస్తోందని రమేశ్ తన బంధువు బుజ్జీకి అపుడపుడూ వాపోతూ వుండేవాడు. తమను చిరాకు పెడుతున్న అక్కాచెల్లెళ్లను ఒకేసారి హత్య చేయాలని రమేశ్, బుజ్జీలు నిర్ణయించుకుని ఓ ప్లాన్ వేశారు. ఇందుకోసం తెలుగుదేశం జెడ్పీటీసీ బాలం ప్రతాప్‌ను సంప్రదించారు. ఈయన విశాఖపట్నంలోని తన సోదరుడు బాలం అండ్రుకు విషయం చెప్పాడు.
అండ్రు ద్వారా కిరాయి హంతకులై సందీప్, దుర్గాప్రసాద్ అనే ఇద్దరు పరిచయమయ్యారు. అంతా కలిసి గౌతమి, పావని హత్యకు పక్కాగా పథక రచనచేశారు. పైకి మామూలు మరణాలుగా కనిపించేలా రంగం సిద్ధం చేశారు. సంక్రాంతికి కోడిపందాలు చూసేందుకు పెద్దఎత్తున వాహనాల్లో బయటవారు వచ్చిపోతుంటారు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం ముసుగులో చంపివేస్తే, ఎవరికీ అనుమానం రాదని భావించారు.
వీరి పథకంలో భాగంగా, ఒక పాత సఫారీ వాహనాన్ని కొనుగోలు చేశారు. అదునుకోసం వేచిచూస్తున్న కిరాయి హంతకులకు గౌతమి, తన సోదరితో కలిసి స్కూటీపై పాలకొల్లులోని ఓ ఆస్పత్రికి వెళుతున్నట్టు సమాచారం వచ్చింది. అంతే... సఫారీ కారులో గౌతమి స్కూటీని వెంబడించారు. పాలకొల్లు సమీపంలో తమ సఫారీతో స్కూటీని బలంగా ఢీకొట్టించారు. ఆ ధాటికి సఫారీ వాహనం అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్ళగా, స్కూటీ నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదం తర్వాత ఇద్దరు హంతకులు అక్కడ నుంచి విశాఖపట్నం పారిపోయారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గౌతమి, పావనిని ఆస్పత్రికి తరలించగా, గౌతమి మాత్రం చికిత్స పొందుతూ మృతి చెందింది. పావని ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ప్రమాదంపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. అయితే, గౌతమి కుటుంబసభ్యులు మాత్రం బుజ్జీ, రమేశ్‌లపై తొలినుంచీ అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. వీరి అనుమానం నిజమైంది. పక్కా ప్లాన్‌తోనే అక్కా చెల్లెళ్లను అంతం చేయాలని నిర్ణయించినట్టు రమేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో బుజ్జీ, ప్రతాప్, అండ్రులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.