ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత బాబాయిని చంపించిన జగన్.. మరింతమందిని చంపేందుకు సిద్ధమా? అంటూ ఆయన ప్రశ్నించారు. శ్రీకాకుళంలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. "జగన్ రెడ్డి తన సొంత బాబాయిని చంపేశారు. మరింతమంది కుటుంబ సభ్యులను చంపేందుకు ఆయన సిద్ధమా?, రాష్ట్రాన్ని కూడా నాశనం చేయాలని అనుకుంటున్నారా? అని జగన్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా అని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా గంజాయి వాసనే వస్తుందన్నారు.
కాగా, గత 2019లో తన సొంత స్వగ్రామమైన పులివెందులలో మాజీ మంత్రి, జగన్ బాబాయి వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారని, జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తన తండ్రిని అకారణంగా 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో టీడీపీ కార్యకర్తలపై పలు కేసుపెట్టారని, తన ఒక్కడిపైనే అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నంతో కలిపి 22 కేసులు పెట్టారని తెలిపారు. గత నాలుగేళ్లుగా అధికార వైకాపాకు తొత్తులుగా వ్యవహరించిన, వ్యవహరిస్తున్న అధికారుల పేర్లను రెడ్ బుక్‌లో రాస్తున్నానని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక వారంతా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.