గుంటూరులో ఆసక్తికరం దృశ్యం : జనసేన ఆఫీసులో నారా లోకేశ్

శుక్రవారం, 17 డిశెంబరు 2021 (08:52 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన నారా లోకేశ్... అక్కడ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కుంచనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీ విషయాలను జనసేన పార్టీ నేతలతో చర్చించారు. 
 
అయితే, వైకాపా నేతలు ఇప్పటికే జనసేన పార్టీని టీడీపీ బి టీమ్‌గా పేర్కొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే జనసేనాని పవన్ కళ్యాణ్ తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ వైకాపా మంత్రులు, నేతలు పదేపదే చేస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ ఇపుడు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి, వైకాపా నేతలకు మరింత అవకాశం కల్పించారు.
 
దీనిపై టీడీపీ నేతలు స్పందించారు. కేవలం మర్యాదపూర్వకంగానే నారా లోకేశ్, జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారని, ఇందులో ఎలాంటి ఉద్దేశాలు, దురుద్దేశాలు లేవని వివరణ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు