ఆపరేషన్ గరుడ. ఈ పేరు చెప్పిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రప్రభుత్వం చేయిస్తున్న దాడుల గురించి వెంటనే గుర్తుకు వస్తుంది. ఐటీ దాడులతో వరుసగా తెలుగుదేశం పార్టీ నేతల్లో వణుకు పుట్టించింది కేంద్ర ప్రభుత్వం. మొదటగా మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఆ తరువాత సిఎం రమేష్, అలాగే పేరం హరిబాబు.. ఇలా ఒక్కరేమిటి టిడిపికి సపోర్టుగా ఉండే పారిశ్రామికవేత్తలపైనా ఐటీ దాడులు కేంద్రప్రభుత్వం చేయించిందనేది విశ్లేషకుల భావన.
ఆపరేషన్ గరుడ పేరు బయటకు చెప్పింది సినీ నటుడు శివాజీనే. బిజెపిలో రాజకీయ నేతగా ఉన్న శివాజీ ఆ తరువాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాటం కూడా చేస్తున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో చంద్రబాబును అరెస్టు చేయించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు శివాజీ.
ఇదిలా జరుగుతుండగానే తాజాగా సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. అదే ఆపరేషన్ గరుడ పార్ట్ బి. త్వరలో టిడిపికి చెందిన 30 మంది నేతలపైన కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు చేశారు. టిడిపికి చెందిన మంత్రులు, ఆ పార్టీకి మద్దతు తెలిపే నేతలు అందరిపైనా ఐటీ దాడులు జరుగుతాయని చెప్పారు. దీంతో ఎపిలో మరోసారి అలజడి రేగింది. కేంద్రం ఆపరేషన్ గరుడ పార్ట్ -2 ప్రారంభించదని నిర్ణయానికి వచ్చేశారు.