మిస్టర్ జగన్... రాసిపెట్టుకో.. వచ్చేది జనసేన - టీడీపీ ప్రభుత్వమే : పవన్ కళ్యాణ్

ఆదివారం, 1 అక్టోబరు 2023 (19:12 IST)
కృష్ణా జిల్లా అవనిగడ్డ వేదికగా ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ ఇచ్చారు. మిస్టర్ జగన్.. రాసిపెట్టుకో.. 2024 తర్వాత ఏపీలో ప్రభుత్వం ఏర్పడేది జనసేన - టీడీపీ ప్రభుత్వమే అని ప్రకటించారు. తన వారాహి విజయ యాత్ర నాలుగో విడతలో భాగంగా ఆదివారం అవనిగడ్డలో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. 
 
ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "జనసైనికులకు, తెలుగు తమ్ముళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులు.. మీరు కౌరవులు..100కి పైగా వైసీపీ వాళ్లు సభ్యులుగా ఉన్నారు కాబట్టి కౌరవులే.. కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే. మీరు అధికారం నుంచి దిగడం.. మేం అధికారంలోకి రావడం ఖాయమం. 
 
మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ అండగా ఉంటాం. 2018 నుంచి ఉద్యోగాలు లేవు. 30 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. అధికారం కోసం నేను అర్రులు చాచడం లేదు. మీ భవిష్యత్ కోసం అనుక్షణం ఆలోచిస్తాను. మనకంటే.. మన పార్టీ కంటే.. మన నేల ముఖ్యం. పాదయాత్రలో జగన్ ఇవ్వని హామీలు లేవు.. అధికారంలోకి వచ్చాక అవన్నీ మరిచిపోయారు' అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
''ఈ పదేళ్లలో జనసేన చాలా దెబ్బలు తిన్నది. ఆశయాలు, విలువల కోసం పార్టీ నడుపుతున్నాం. వైసీపీని ఓడించడమే జనసేన టార్గెట్. చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు చీలకూడదు అన్నాను. మళ్లీ చెబుతున్నాను.. మీరు (వైసీపీ) ఓడిపోవడం ఖాయం.. మేము అధికారంలోకి రావడం డబుల్ ఖాయం.. మెగా డీఎస్సీ వారికి న్యాయం జరగడం ట్రిపుల్ ఖాయం. 
 
ఉమ్మడి రాష్ట్రానికి అవనిగడ్డ డీఎస్సీ శిక్షణలో ఆయువుపట్టు. 30 వేల పైచిలుకు డీఎస్సీ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. లక్షకోట్లు, కిరాయి సైన్యం, పోలీస్ శాఖ వారి దగ్గర ఉంది. మా దగ్గర ఏముంది ఒక మైక్ తప్ప. మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెబుతున్నా.. ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తీరుస్తాను. పదేళ్లలో చాలా దెబ్బలు తిన్నాను.. ఓటమి నిస్సహాయంగా ఉంటుంది. ఆశయాలు, విలువలకోసం నడిపేవాడ్ని కాబట్టే నిలబడి ఉన్నాను' అని సేనాని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు