నేడు పోలవరం సందర్శనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

వరుణ్

సోమవారం, 17 జూన్ 2024 (08:50 IST)
పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి రానున్నంది. గత ఐదేళ్ళుగా పడకేసిన పనులను కొత్త ప్రభుత్వం మళ్లీ ప్రారంభించనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం సందర్శనకు వెళ్లనున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి జిల్లా పర్యటన ఇదే కావడం గమనార్హం. 
 
2014-19 మధ్య సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలు పెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 1:30 గంటల వరకు పనులను పరిశీలించి, 3:05 వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం విలేకర్లతో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరుగు పయనమవుతారు. 
 
మరోవైపు, బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఆయన శుక్షాకాంక్షలు తెలిపారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను వీడి మానవుల్లో త్యాగనిరతిని వ్యాప్తి చేయడమే బక్రీద్‌ పండుగ ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. హజ్రత్‌ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ బక్రీద్‌ను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటున్న ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ను స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానవత్వాన్ని సాధిద్దామన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు