మిర్యాలగూడలో మంచి పలుకుబడివున్న ధనవంతుల్లో మారుతీరావు ఒకరు. ఈయన కుమార్తె అమృత. అయితే, ఈమెను అదే ప్రాంతానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని మారుతిరావు.. కిరాయి మనుషులతో ప్రణయ్‌ను హత్య చేయించాడు.
ఈ కేసులో మారుతిరావుతో పాటు.. ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, హత్య చేసిన ఖరీంలను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిజానికి వీరు శనివారమే వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉన్నా... బెయిల్ పత్రాలు నిర్ణీత సమయంలో అందక పోవడంతో ఆదివారం ఉదయం విడుదల చేశారు.
కాగా, ఈ ముగ్గురిపై 2018 సెప్టెంబర్ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు బెయిల్‌పై బయటకు వస్తే ప్రణయ్ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు.