రాధా మ‌న‌సు మారి... మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌ద్ద‌కే... సభ్యత కాదని ఖండించిన వంగ‌వీటి

మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (11:08 IST)
త‌న‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ వంచించాడ‌ని గ‌తంలో తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన వంగ‌వీటి రాధాకృష్ణ మ‌న‌సు మారిందా? మ‌ళ్లీ జ‌గ‌న్ పంచ‌న చేర‌నున్నారా? అనే ఊహాగానాలు విజ‌య‌వాడ‌లో మొద‌ల‌య్యాయి. అయితే, దానిని ఆది లోనే వంగ‌వీటి వ‌ర్గీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మొన్న గుడివాడ‌లో మంత్రి కొడాలి నాని, వంగ‌వీటి రాధాకృష్ణ మ‌ధ్య సుమారు రెండు గంట‌ల పాటు జ‌రిగిన భేటీతో ఆయ‌న తిరిగివ వైసీపీ గూటికి చేర‌తార‌నే రాజ‌కీయ క‌ల‌క‌లం రేగింది. 
 
వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీలో వంగ‌వీటి రాధాకృష్ణ క్రియాశీల‌కంగా ప‌నిచేశారు. వైసీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. 2019 ఎన్నిక‌ల ముంగిట విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టికెట్ విష‌యంలో జ‌గ‌న్‌తో వంగ‌వీటి రాధాకు విభేదాలు వ‌చ్చాయి. ఆ స్థానాన్ని మ‌ల్లాది విష్ణుకు ఖ‌రారు కావ‌డం, మ‌రోచోటికి వెళ్లాల‌ని రాధాను కోర‌డంతో స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైన సంగ‌తి తెలిసిందే. 
 
మ‌చిలీ ప‌ట్నం ఎంపీ స్థానానికి పోటీ చేయాల‌నే పార్టీ ప్ర‌తిపాద‌న‌ను వంగ‌వీటి తిర‌స్క‌రించి... ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, తాజాగా వైసీపీలో చేరేందుకు వంగ‌వీటి రాధా సుముఖంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గుడివాడ‌లో ఆదివారం మంత్రి కొడాలి నానికి చెందిన అతిథిగృహంలో వంగ‌వీటి రాధా, కొడాలి భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. స్నేహితుడైన వంగ‌వీటి రాధాను ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాల‌నే ప‌ట్టుద‌ల‌తో కొడాలి నాని ఉన్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల కొడాలి నానిపై వంగ‌వీటి రాధాను పోటీలో నిలుపుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో రాధానే పార్టీలో చేర్చుకుంటే స‌రిపోతుంద‌ని కొడాలి నాని ఎత్తుగ‌డ వేసిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.
 
వంగ‌వీటికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చే ప్ర‌తిపాద‌న చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే వంగ‌వీటి రాధా వైసీపీలో చేర‌డం లాంఛ‌న‌మే అని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, వైసిపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వంగవీటి రాధా తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. గుడివాడ పరిణామాలపై అనుచరులతో మాట్లాడిన వంగవీటి రాదా, తాను వైసిపిలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు చెపుతున్నారు. శుభకార్యాలను సైతం రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతి గుడివాడకు పాకింద‌ని, శుభకార్యాలలో శత్రువు ఎదురుపడినా పలకరించడం భారతీయ సంప్రదాయం అని పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. సంస్కృతి, సంప్రదాయాల స్ధానంలో కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నార‌ని అంటున్న‌ట్లు స‌మాచారుం. ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోలేద‌ని అనుచరులతో వంగవీటి రాధా అన్న‌ట్లు చెపుతున్నారు. 
 
పామర్రు నుంచి గుడివాడకు ర్యాలీగా తరలి వెళ్ళేందుకు వంగవీటి అభిమానులు సమాయత్తమయ్యారు. కానీ, ర్యాలీలతో శుభకార్యాలకు హాజరు కావడం సభ్యత కాదని వంగవీటి అభిమానులను వారించాన‌ని, మన రాజకీయాలకు శుభకార్యాలు వేదిక కాకూడదు అని అనుచరులతో వంగవీటి రాధా అన్నార‌ట‌. శుభకార్యంలో ఉన్నప్పుడే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి తెలిసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్ర‌చారంపై వంగవీటి రాధా ఆగ్రహాం చెందినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు