పవన్ కళ్యాణ్ బలవంతుడు కాకపోతే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు...

ఠాగూర్

సోమవారం, 4 మార్చి 2024 (09:10 IST)
వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓ చిక్కు ప్రశ్న ఉత్పన్నమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బలవంతుడు ఔనా కాదా అన్నది ఓ విలేకరి సంధించిన ప్రశ్నకు సజ్జల ఒక్కసారిగా అవాక్కయ్యారు. సూటిగా సమాధానం చెప్పలేక కప్పదాటు సమాధానం చెప్పారు. పవన్ బలవంతుడు కానీ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడమే అజెండాగా పని చేస్తున్నారని అన్నారు. అందుకే ఆయన్ను ప్రతి ఒక్కరూ టార్గెట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అదేసమయంలో తమ పార్టీ గతంలో కంటే మరింతగా బలపడిందని చెప్పుకొచ్చారు. 
 
పలువురు సీనియర్ జర్నలిస్టులతో ఆయన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు సూటిగా అడిగిన ప్రశ్నలకు సజ్జల సమాధానాలు ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యాడని భావించిన ప్రజలు జగన్‌పై కొత్త ఆశలు నిలుపుకుని వైసీపీకి అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. కరోనా సంక్షోభం కొనసాగిన రెండేళ్ల కాలం తీసేసినా, ఈ 57 నెలల ప్రస్థానంలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్యం... ఇలా సామాన్యుడికి అవసరమైన అంశాలలో దేశంలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా జగన్ పాలన నిలిచిపోతుందని సజ్జల వివరించారు. అందుకే సీఎం "వై నాట్ 175" అంటున్నారు... దాన్నే మేం రిపీట్ చేస్తున్నామని తెలిపారు. 
 
ఇక, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ గురించి ఓ జర్నలిస్టు సజ్జలను అడిగారు. పవన్ కల్యాణ్ బలవంతుడా, బలహీనుడా అని ప్రశ్నించారు. ఆయన బలం చూడాల్సిన అవసరం తమకేంటని సజ్జల బదులిచ్చారు. పవన్ బలవంతుడు కాకపోతే ఆయనను అంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సదరు జర్నలిస్టు తన ప్రశ్నను మరో కోణంలో సంధించారు. అందుకు సజ్జల స్పందిస్తూ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడమే తన అజెండా అన్నట్టుగా పవన్ వైఖరి ఉందని విమర్శించారు. పవన్‌కు ఒక సొంత అజెండా లేదని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే చదువుతున్నాడని, అందువల్లే పవన్ ఎక్కువగా టార్గెట్ అవుతున్నాడని వివరించారు.
 
షర్మిల అంశాన్ని ప్రస్తావిస్తూ... ఇంట్లో వాళ్లకే న్యాయం చేయని వ్యక్తి, ప్రజలకేం న్యాయం చేస్తాడని ప్రజలు అడిగితే బాగానే ఉంటుందని, కానీ చంద్రబాబు ఆ ప్రశ్న అడగడం ఏంటని సజ్జల పేర్కొన్నారు. షర్మిల అంటున్న మాటలను చంద్రబాబు చిలకపలుకుల్లా పలుకుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు అలా మాట్లాడాల్సిన అవసరంలేదని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు