విద్యా సంస్థలు మూసివేసే ప్రసక్తే లేదు : ఏపీ విద్యా మంత్రి

బుధవారం, 24 మార్చి 2021 (12:37 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలను మూసివేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు ఆ దిశగా పయనిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని విద్యాలయాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పదుల సంఖ్య దాటి, వందల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 
 
బుధవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకుముందులాగే ఆన్‌లైన్ విద్యావిధానం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిన్నమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం స్కూళ్లకు సెలువులు ఇచ్చే ప్రసక్తే లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌ విద్యా బోధన ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 
 
ఆన్‌లైన్ క్లాస్‌ల వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతానికి పాఠశాలలకు సెలవులు ఇచ్చేది లేదని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. స్కూళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. 
 
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడొద్దని మంత్రి సురేష్ కోరారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్ ప్రోటోకాల్‌ని తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. మాస్క్‌లు విధిగా ధరించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు