Senior citizen: వృద్ధురాలిని చంపిన కేర్ టేకర్.. 8 గ్రాముల బంగారును ఎత్తుకెళ్లాడు..

సెల్వి

శనివారం, 23 ఆగస్టు 2025 (15:40 IST)
తిరుపతిలో శుక్రవారం ఘోరం జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలిని కేర్ టేకర్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చంపి బంగారం ఎత్తుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. శివ ఆనంద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్‌లో తండ్రి షణ్ముగం, మేనత్త ధనలక్ష్మిలతో కలిసి ఉంటున్నాడు. హైదరాబాద్‌లోని కంపెనీకి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు.
 
తండ్రి షణ్ముగం ఇటీవల పక్షవాతానికి గురికావడంతో స్థానిక ఏజెన్సీ ద్వారా రవి అనే వ్యక్తిని కేర్ టేకర్‌గా పెట్టుకున్నాడు. ఏజెన్సీకి నెలకు రూ.25 వేలు చెల్లిస్తున్నాడు. అయితే, సదరు ఏజెన్సీ ఇందులో కేవలం రూ.15 వేలు మాత్రమే రవికి జీతంగా చెల్లిస్తోంది. దీంతో జీతం సరిపోవడంలేదని రవి మానేశాడు.
 
రవి నమ్మకంగా పనిచేస్తుండడంతో ఏజెన్సీతో సంబంధం లేకుండా రూ.22 వేలు ఇస్తానని చెప్పి శివ నేరుగా అతనిని నియమించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో మీటింగ్‌కు హాజరవ్వాల్సి ఉండడంతో రవికి జాగ్రత్తలు చెప్పి శివ బయలుదేరాడు. 
 
ఇదే అదనుగా భావించిన కేర్ టేకర్ రవి.. ఇంట్లో నిద్రపోతున్న ధనలక్ష్మి గొంతు కోసి, ఆమె చెవికి ఉన్న 8 గ్రాముల బంగారు కమ్మలను తీసుకుని పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు