ఓ లేడీ కానిస్టేబుల్... ఇద్దరు ఖాకీలు : అక్రమసంబంధంలో ఆధిపత్య పోరు.. కత్తులతో పొడుచుకున్న కానిస్టేబుల్స్

సోమవారం, 6 మార్చి 2017 (09:19 IST)
వివాహిత అయిన ఓ లేడీ కానిస్టేబుల్ చేసిన పాడుపనికి ఇద్దరు కానిస్టేబుళ్లు కత్తులతో పొడుచుకున్నారు. దీంతో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా, లేడీ కానిస్టేబుల్‌తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ పరిస్థికి ఆ లేడీ కానిస్టేబుల్ మరో ఇద్దరు కానిస్టేబుళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తేని జిల్లా కూంబావై గ్రామానికి చెందిన ప్రవీణ్‌ కుమార్‌ (30) ఆర్మీలో పని చేస్తున్నాడు. ఆయన భార్య శరణ్య (23). ఈమె తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయంలో సాయుధదళం కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. భర్త ఆర్మీలో ఉండటంతో తిరువళ్లూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తనకుతోడుగా తండ్రిని తీసుకొచ్చుకుంది. 
 
ఈనేపథ్యంలో తన వృత్తిలో భాగంగా శరణ్య ట్రైనింగ్‌ కోసం ఢిల్లీ వెళ్లింది. అక్కడ చెన్నై సాయుధ దళం కానిస్టేబుల్‌ అమృతరాజ్‌ (25)తో పరిచయం ఏర్పడి... వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరువళ్ళూరుకు వచ్చిన శరణ్యకు స్థానికంగా పనిచేస్తున్న కల్లనై (23) అనే కానిస్టేబుల్‌తోనూ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈమె ఇద్దరు రంకు భర్తల వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూ వచ్చింది. 
 
అయితే, శరణ్యతో కల్లనైకు సంబంధం ఉన్నట్టు అమృతరాజ్‌కి తెలిసి.. కల్లనైకి ఫోన్ చేసి బెదిరించారు. దీంతో ఆగ్రహించిన కల్లనై తనతోపాటు పనిచేస్తున్న సుందరపాండి (24), చంద్రన్ (24) సంతాన కుమార్‌ (26) అనే ముగ్గురు కానిస్టేబుళ్లతో కలిసి అమృత రాజ్‌ను హతమార్చేందుకు పథకం వేశాడు. 
 
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి శరణ్య ఇంటిలో అమృతరాజ్‌ ఉన్నట్టు తెలుసుకున్న కల్లనై బృందం... ఆ ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి సుందరపాండి మాత్రమే వెళ్లగా మిగిలిన ముగ్గురు ఇంటి బయట ఉన్నారు. శరణ్య ఇంట్లోకి సుందరపాడి రావడాన్ని చూసిన అమృతరాజ్‌ బయటికి పొమ్మని కసురుకున్నాడు.
 
దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అమృతరాజ్‌ తన వద్ద వున్న కత్తితో సుందరపాండిపై దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన సుందరపాడి కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న సుందరపాండిని చికిత్స నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై తిరువళ్లూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అమృతరాజ్‌ను అరెస్టు చేయగా, కానిస్టేబుళ్లు శరణ్య, చంద్రన్, సంతానకుమార్‌, కల్లనైలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి